నడిచే దేవుళ్ళు డాక్టర్లు!

( దైవత్వాన్ని మరచి రాక్షసులుగా మారిపోతున్న దౌర్భాగ్యం. )

- ఆసుపత్రులపై నమ్మకాన్ని కోల్పోతున్న జనాలు. 
- డబ్బుకోసం పీడించడం తప్ప ప్రయోజనం ఉండటం లేదు.
- గవర్నమెంట్ ఆసుపత్రులను గాలికొదిలేస్తున్న దుర్మార్గం. 
- ఉచిత వైద్యం అందించాల్సిన పరిస్థితులు మృగ్యం. 
- పాడుబడిన స్థితికి చేరుకుంటున్న సర్కార్ దవాఖానాలు.
- ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఒరగబెడుతున్నది ఏమీ లేదు. 
- తమ బాధ్యతలు మరచి మానవత్వానికి మచ్చ తెస్తున్న కొందరు వైద్యులు. 
- సామాన్యుల రక్తం పీలుస్తున్న కార్పొరేట్ వైద్యశాలలు.
- కార్పొరేట్ ఆసుపత్రులకు దాసోహం అంటున్న ప్రభుత్వాలు.
 - ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం. 

" వైద్యో నారాయణో హరి " అన్నారు.. అంటే వైద్యుడు సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయుడితో సమానం అని అర్ధం.. కానీ సోకాల్డ్ డాక్టర్లు కొందరు సరైన వైద్యం చేయకుండా రోగుల ప్రాణాలను హరీమనిపిస్తున్నారు. భగవంతుడు ప్రాణం పోస్తే.. వైద్యుడు ఆ ప్రాణాలను నిలబెడతాడు.ఈ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్తే ఎలాంటి ఆరోగ్య ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు ఆయన ఆశ ఉంటుంది.కానీ ఇప్పుడు పరిస్థితులు ఇందుకు భిన్నంగా గోచరిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను లెక్కజేయకుండా కేవలం డబ్భు సంపాదన కోసమే కొందరు వైద్యులు పనిచేస్తున్నారు. ఇక ఇలాంటి కోవలోకి చేరే పలు ఆసుపత్రులు ఇప్పుడు కోకొల్లలుగా పుట్టుకు వస్తున్నాయి. తమ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవాలని భావించి ఆసుపత్రులకు వస్తున్న రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.. దీనికి తోడు సాక్షాత్తూ పాలక ప్రభుత్వాలే కార్పొరేట్ ఆసుపత్రులకు ఊడిగం చేస్తున్నాయి. కారణం ఏమిటంటే దాదాపు కార్పొరేట్ ఆసుపత్రులు అధికార, రాజకీయ నాయకుల బంధువర్గానివో, స్నేహితులవో, బాగా కావాల్సిన వారివో అయి ఉండటం గమనార్హం.
 
1000456274
హైదరాబాద్, జులై 30 ( భారత శక్తి ) : భగవంతుడు మనకు ప్రాణం పోస్తాడు.. తల్లి జన్మనిస్తుంది.. ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పోయే ప్రాణాన్ని నిలబెడతారు వైద్యులు.. అలాంటి వైద్యులను మనం నడిచే దేవుళ్లుగా భావిస్తాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య వృత్తిని వ్యాపారంగా భావిస్తున్నారు వైద్యులు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభ్యసించిన వైద్య శాస్త్రాన్ని, ఒక బిజినెస్ కంపెనీగా భావిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. వైద్య శాస్త్రం అభ్యసించిన అనంతరం అందరికీ ఉద్యోగాలు రావాలంటే కష్టం, అందుకనే చాలామంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక్కోసారి అందులో సక్సెస్ అవుతారు, కొంతమందికి కలిసిరాదు. ఒక్కసారి వైద్యుడిగా మంచి పేరు వచ్చిందంటే తిరుగుండదు. కానీ అన్ని సార్లు అలా జరగదు కదా..? అందుకే చాలా మంది వైద్యులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతూ ఉంటారు. కేవలం సంపాదనే ధ్యేయంగా సాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో వారు తమ వృత్తికి తీరని ద్రోహం చేస్తుంటారు.ఇది ఎన్నో సార్లు నిరూపణ అయ్యింది. చట్టానికి విరుద్ధంగా, నియమ నిబంధనలు పాటించకుండా వైద్యం చేస్తుంటారు. దాంతో లక్షల్లో సంపాదన వస్తుంది. అవసరం లేకపోయినా అనవసర పరీక్షలంటూ రోగులను పీల్చి పిప్పి చేస్తారు. రోగం ఒకటైతే మరొకటి కల్పించి చెప్పి భయపెట్టి డబ్బులు గుంజుతుంటారు. అంతెందుకు చనిపోయిన రోగికి వైద్యం పేరుతో డబ్బులు కాజేసిన ఘటనలు కూడా ఎన్నెన్నో చూశాం. 
1000456285
 
ఇదో ఎత్తైతే.. అసలు నిబంధనలు పాటించకుండా, చట్ట వ్యతిరేకంగా నడిచే ఆసుపత్రులు ఎన్నెన్నో ఉన్నాయి.. సరైన ప్రికాషన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా, రూల్స్ కి వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. ఒక్కసారి ఆసుపత్రికి వెళ్తే తిరిగి వస్తామా..? అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.కరోనా సమయంలో ఎన్నెన్నో చూశాం. ఆసుపత్రికి వెళ్లి లక్షలు తగలెయ్యడం తప్ప ప్రాణాలతో తిరిగివచ్చినవారు అరుదుగా కనిపిస్తారు. కాగా అనుమతులు లేకుండా, అడ్డదారుల్లో నడుస్తున్న ఆసుపత్రులను కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంతో అక్రమార్కులు మరీ పేట్రేగిపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతున్నారు. దీనికి తోడు నకిలీ డాక్టర్లు పుట్టకొకరు, చెట్టుకొకరు పుట్టుకు వస్తున్నారు.తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అలాగే కొందరు వైద్యులు మానవత్వం మరిచి, అవసరం లేకపోయినా ఆపరేషన్లు చెయ్యడం.. కాలం చెల్లిన మందులు ఇవ్వడం.. ఒక్కో వైద్యానికి ఒక్కో రకంగా పరిమితిని మించి వసూలు చేయడం చేస్తున్నారు.
 
1000456272
మనిషిలో స్వార్ధం పెరిగిపోవడంతో ఇవన్నీ జరుగుతున్నాయన్నది అక్షర సత్యం. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరానికి సరిపడా తీసుకుంటూ వైద్యం చేసే డాక్టర్లను వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. ఈ సమాజంలో వైద్యం అనేది ఎంతో ప్రముఖ స్థానంలో ఉంది.అలాంటి వైద్యాన్ని కూడా అక్రమార్జనకు ఉపయోగిస్తున్న డాక్టర్లు వేలసంఖ్యలో హైదరాబాద్ నగరంలో కనిపిస్తారు. ఒక్క హైదరాబాద్ నగరమే కాదు, దేశంలో ప్రతి చోటా ఇదే పరిస్థితి నెలకొని వుంది. ఇలా అక్రమంగా సంపాదించిన పైకాన్ని ఏమి చేసుకుంటారో అర్ధం కాదు.. ఎల్లకాలం ఎవరూ జీవించి ఉండరు కదా..? జీవితకాలం సరిపడా సంపాదన సరిపోతుంది కదా..? పోయాక మూటగట్టుకుని పోలేరు కదా..? ఇవన్నీ వారికి తెలియదా..? అనుకుంటే పొరబాటే.. అన్నీ తెలుసు తెలిసి కూడా అడ్డదారుల్లో వెళ్తున్నారంటే ఇంకా ఏమి చెప్పగలం. 
1000456283
 
పోతే కొంతమంది నిజాయితీగా వైద్యం చేస్తున్న డాక్టర్లు లేకపోలేదు, కానీ వారికి సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ఒక్కో డాక్టర్ ను తయారు చెయ్యడానికి ప్రభుత్వం వారిమీద ఎంతో ఖర్చుపెడుతోంది. అలాంటప్పుడు వారిని సరైన క్రమంలో, పద్దతిలో వినియోగించుకోవాలి కదా..? కానీ అలా జరగడం లేదు. అందుకే చాలా మంది వైద్య నిపుణులు, విద్యార్థులు అప్పు చేసైనా సరే విదేశాలకు వెళ్లిపోతున్నారు. కన్నతల్లి లాంటి భారతావని ఒడిలో తమ సేవలు అందించటానికి వీలులేక కష్టమైనా విదేశాలకు వెళ్తున్నారు. విదేశీయులు వైద్య వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వైద్యులకు కోరినంత జీతాలు కూడా వెచ్చిస్తారు. దురదృష్టం ఏమిటంటే క్లిష్టమైన వైద్య సమస్యలు ఏదైనా ఒక ప్రముఖుడికి ఎదురైతే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అయితే అక్కడ వైద్యం చేసేది మన దేశస్తులే కావడం విశేషం. వైద్య వృత్తికే మన దేశంలో ఎంతటి క్లిష్టపరిస్థితి ఏర్పడిందో తలుచుకుంటేనే గుండెలవిసిపోతాయి.
1000456279
 
ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలి.
 
 సరైన విద్య సదుపాయం లేక నిత్యం వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైద్యం ఖరీదైన అంశంగా మారిపోవడంతో పేదవాడు వైద్యానికి దూరం అవుతున్నాడు. అక్రమార్జనకు అలవాటుపడ్డ వైద్యులు కార్పొరేట్ కు కొమ్ముకాస్తున్నారు. ఆసుపత్రుల వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా ఉండటంతో ఇటు ప్రముఖులే కాకుండా,అటు రాజకీయ నాయకులు కూడా ఎదో ఒక రూపంలో ఆసుపత్రుల నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. ఈ పరిస్థితులే కంటకంగా మారిపోతున్నాయి. వీరికి అమాయకుల ప్రాణాలంటే లెక్కలేదు. కేవలం సంపాదన మాత్రమే ముఖ్యం.
1000456276
 
వైద్యం ఉచితం కావాలి.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్యం అనేది బ్యాన్ కావాలి. పూర్తిగా వైద్యం అనే రెండక్షరాలు ప్రభుత్వ ఆదేనంలోకి రావాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వైద్య వృత్తి సాగాలి. దీనిపై " ఫోరం యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పోరాటం సాగిస్తోంది. మాతో మీరు కూడా చేతులు కలపండి. వైద్యాన్ని విలువైనదిగా కాకుండా, వీలైనదిగా మారేలా ప్రయత్నం చేద్దాం.
1000456281
 
 

About The Author