అన్నదాత గోస... కదలని ధాన్యం బస్తాలు!
- అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం
- కొనుగోలు కేంద్రాల్లో రైతుల కన్నీటి గాధ
- కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలు... పట్టించుకోని అధికారు
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో రైతుల ఆవేదన రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుండగా, అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మరో 15 రోజులలో భారీ వర్షాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం బస్తాలు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయి ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి యాలాల మండలంలోని బెన్నూర్, జుంటుపల్లి, ఒరేయ్ కొనుగోలు కేంద్రాల్లో వేల సంఖ్యలో నిల్వ ఉంచిన వరి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షపు నీరు ధాన్యంలోకి చేరకుండా రైతులు తాడిపత్రాలు కప్పి, నీటిని చేతులతో తొలగిస్తూ పడుతున్న అవస్థలు హృదయ విదారకంగా మారాయి.
రోజులు తరబడి కష్టపడి పండించిన పంట వర్షాలకు నాశనం అవుతుండగా, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని చెప్పిన అధికారులు మాటల్లోనే పరిమితమయ్యారు. కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో మా పంట నష్టపోతోంది” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తడవడంతో నాణ్యత దెబ్బతిని, మద్దతు ధర కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
