ఎల్బీనగర్,సరోర్‌నగర్ సర్కిల్‌లో ‘పన్నుల దోపిడి!
- * కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ గల్లంతు?
- * కమర్షియల్ భవనాల రీ-అసెస్‌మెంట్‌లో భారీ అక్రమాలు
- * కోణార్క్ థియేటర్ ఎదురుగా భారీ కమర్షియల్ నిర్మాణానికి పన్ను రాయితీ..
- * మున్సిపల్ ఖజానాకు చేరవలసిన పన్ను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న అవినీతి అధికారులు..
- * డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, టాక్స్ అధికారి బాబురావు పై పూర్తి ఆధారాలతో వార్తా కథనాలు రాస్తున్నా చర్యలు ఎక్కడ..!
- * మహానగరం మూడు కార్పొరేషన్ల టాక్స్ అధికారిని రాధిక గుప్త ఐఏఎస్ ఏం చేస్తున్నారు..!
- * ఏసీబీ విజిలెన్స్ నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి..!
- *ఉన్నతాధికారుల మౌనంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
*ఎల్బీనగర్:
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరోర్‌నగర్ సర్కిల్‌లో ఆస్తి పన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) వసూళ్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, టాక్స్ అధికారి బాబురావు పై పూర్తి ఆధారాలతో వార్తా కథనాలు రాస్తున్నా చర్యలు ఎక్కడ, సర్కిల్ స్థాయిలోని మరి కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై లక్షలు, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్ జరుగుతున్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా, పైస్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు..jpeg)
* రీ-అసెస్‌మెంట్‌ల ముసుగులో భారీ స్కామ్
సరోర్‌నగర్ సర్కిల్ పరిధిలోని పలు వాణిజ్య (కమర్షియల్) భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను రికార్డులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం భారీ వాణిజ్య భవనాలకు క్రమబద్ధంగా పునఃసమీక్ష (రీ-అసెస్‌మెంట్) నిర్వహించాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే పన్ను మొత్తాన్ని తగ్గించడం, పాత బకాయిలను తక్కువగా చూపించడం వంటి అక్రమాలకు పాల్పడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి కోట్ల రూపాయల గండి కొడుతున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్రజయ్ ప్రిన్స్‌టన్ టవర్స్ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
*మొదటి ఉదాహరణ:
డోర్ నంబర్: 11-15-14/1/PP (ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య - PTIN: 1031123514) గల భవనానికి సంవత్సరానికి రూ.7,21,074/- పన్ను చెల్లించాల్సి ఉంది. ఖాళీగా ఉన్నందుకు ఇచ్చే రాయితీ (వేకెన్సీ రెమిషన్) పేరిట మినహాయింపులు ఇచ్చిన తర్వాత కూడా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి పన్ను వసూలు కాలేదు. ప్రస్తుతం కంప్యూటర్ వ్యవస్థ (సిస్టమ్)లో కేవలం రూ.1,54,598/- మాత్రమే చూపిస్తుండడం గమనార్హం. ఈ ఒక్క ఆస్తి పైనే సుమారు రూ.12,87,550/- మేర కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
అదే భవనంలోని డోర్ నంబర్: 11-15-14/1/PPT/3F,4F (PTIN: 1031123110) కు ఏడాదికి రూ.30,73,044/- పన్ను వసూలు కావాల్సి ఉంది. కానీ, రికార్డుల్లో ప్రస్తుతం కేవలం రూ.2,98,638/- మాత్రమే బకాయి ఉన్నట్లు చూపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.58,47,450/- మేర మున్సిపల్ ఆదాయాన్ని లూటీ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
*కోనార్క్ థియేటర్ వద్ద రెండేళ్లుగా ‘మామూలు’ మౌనం!
స్థానిక కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఐదు అంతస్తుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌కు గత రెండేళ్లుగా పన్ను సవరణ (ట్యాక్స్ రివిజన్) చేయకపోవడం మరో పెద్ద స్కామ్‌గా కనిపిస్తోంది. సదరు భవనంలో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు పునఃసమీక్ష చేయకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*ఆశ్చర్యకరంగా అత్యల్ప పన్నులు:
మరికొన్ని ప్రాంతాల్లోని భారీ ఆస్తులకు నామమాత్రపు పన్నులు విధించడం అధికారుల చేతివాటానికి అద్దం పడుతోంది.
* డోర్ నంబర్: 13-9-11/NR గల ఆస్తికి కేవలం రూ.1,300/- పన్నుగా నిర్ధారించారు.
* డోర్ నంబర్: 13-9-12/NR కు రూ.43,478/- మాత్రమే పన్ను చూపిస్తున్నారు.
భవనాల పరిమాణం, ప్రస్తుత వాణిజ్య వినియోగాన్ని బట్టి చూస్తే ఈ లెక్కలు ఏమాత్రం పొసగడం లేదని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఈ నిర్ధారణలు జరిగాయని స్పష్టమవుతోంది.
సామాన్యుడిపై ప్రతాపం.. పెద్దలకు రాయితీలా?
మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని కొందరు అధికారులు లూటీ చేస్తుంటే, సకాలంలో పన్నులు చెల్లించే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మాత్రం రెవెన్యూ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజిలెన్స్, ఏసీబీ విచారణకు డిమాండ్
సరోర్‌నగర్ సర్కిల్‌లో జరుగుతున్న పన్ను దోపిడీపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నప్పటికీ పైస్థాయి అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ, పరిపాలనా ఒత్తిళ్లు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పాత్రపై సైతం ఆరోపణలు వస్తున్నందున... ఈ వ్యవహారంపై కేవలం అంతర్గత విచారణలకే పరిమితం కాకుండా విజిలెన్స్ విభా గం లేదా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పూర్తిస్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
.jpeg)
