కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ అనర్హుడు: కేటీఆర్

  • కుమారుడిపై 'పోక్సో' కేసు.. వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
  • బాధిత కుటుంబానికి అండగా నిలిచింది ఒక్క బీఆర్‌ఎస్సే!
  • రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
  •  ఎల్బీనగర్ ‘నా బూత్- నా భవిష్యత్తు’ సభలో భరత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు ధ్వజం

కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ అనర్హుడు: కేటీఆర్

హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి తక్షణమే తొలగించాలని భరత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, యావత్ దేశానికే అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎల్బీనగర్‌లో నిర్వహించిన ‘నా బూత్- నా భవిష్యత్తు’ పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రమంత్రి కుమారుడు భగీరథ్ బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద నమోదైన కేసులో అరెస్టయిన నేపథ్యంలో కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

* బాధితురాలికి అన్యాయం చేసేందుకు కుట్ర!
రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు లోపాయికారీగా చేతులు కలిపి బాధితురాలికి అన్యాయం చేయాలని చూశాయని విమర్శించారు. అయితే, ఆ బాలికకు న్యాయం జరిగేలా, నిందితుడికి శిక్ష పడేలా బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడిందని గుర్తుచేశారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.

* ‘బేటీ బచావో కేవలం నినాదమేనా?
ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ (బాలికలను చదివించండి.. బాలికలను రక్షించండి) అనే నినాదం కేవలం మాటలకే పరిమితమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో బహుశా మొదటిసారిగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు (దేశం విడిచి వెళ్లకుండా జారీ చేసే నిఘా పత్రం) జారీ చేసే పరిస్థితి రావడం దారుణమన్నారు.

* పదవిలో ఉంటే విచారణ సక్రమంగా జరగదు:
బండి సంజయ్ కేంద్రమంత్రి పదవిలో కొనసాగితే ఈ కేసులో పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరగదని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. తప్పు చేసిన నిందితుడిని దాదాపు తొమ్మిది రోజుల పాటు చట్టానికి దొరకకుండా దాచిపెట్టింది స్వయంగా కేంద్రమంత్రేనని ఆయన ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి, కేసును నీరుగార్చడానికి అధికార బలంతో ప్రయత్నించారని ధ్వజమెత్తారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం ఆపదని కేటీఆర్ స్పష్టం చేశారు.WhatsApp Image 2026-05-17 at 18.27.59

About The Author