నీట్ ముసుగులో నిలువు దోపిడీ.. సూత్రధారి కులకర్ణి అరెస్ట్

  • ● అక్షర వ్యాపారంలో ‘కెమిస్ట్రీ’ మాస్టర్.. పుణేలో పట్టుకున్న సీబీఐ
  • ● రూ. వందల కోట్ల దందా.. వ్యవస్థల కళ్లుగప్పి ప్రశ్నల విక్రయం
  •  ●  తెర వెనుక ‘పెద్దల’ హస్తంపై అనుమానాలు!

నీట్ ముసుగులో నిలువు దోపిడీ.. సూత్రధారి కులకర్ణి అరెస్ట్

*హైదరాబాద్ :
లక్షలాది మంది పేద విద్యార్థుల డాక్టర్ కలలను చిదిమేస్తూ, అక్షరాలను అంగడి సరుకుగా మార్చిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో అసలు ‘డొంక’ కదిలింది. ఈ దేశవ్యాప్త కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు పుణేలో కరడుగట్టిన నేరగాడిలా చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ ప్యానెల్‌లో ఉంటూనే, కంచే చేను మేసిన చందంగా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ ప్రొఫెసర్ బాగోతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వ్యవస్థల గుండెల్లో కన్నం!
ప్రశ్నపత్రాల రూపకల్పనలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న కులకర్ణి, తన మేధస్సును నేరానికి వాడాడు. ఎన్‌టీఏ (NTA) లోపల ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని, కెమిస్ట్రీ విభాగానికి సంబంధించిన ప్రశ్నలను గుట్టుచప్పుడు కాకుండా బయటకు చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
 
డిజిటల్ దొంగతనం: సాధారణ మెయిల్స్ కాకుండా, ట్రేస్ చేయడానికి వీల్లేని ‘ఎన్‌క్రిప్టెడ్’ యాప్స్ మరియు డార్క్ వెబ్ వేదికగా ఈ దందా సాగించినట్లు సీబీఐ గుర్తించింది.
 
ఐపీ అడ్రస్ గుట్టురట్టు: నిందితుడు వాడిన ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్‌లను విశ్లేషించగా, డేటా లీక్ అయిన సమయం.. పరీక్షా పత్రాల తయారీ సమయంతో సరిపోలింది.

కోచింగ్ మాఫియాతో కుమ్మక్కు:

కులకర్ణి కేవలం ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు, దేశవ్యాప్త కోచింగ్ మాఫియాకు ‘గోల్డెన్ హ్యాండ్’గా మారాడు.
 1. ఒక్కో తలకు రూ. 50 లక్షలు: దళారుల ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

 2. నెట్‌వర్క్ విస్తృతి: పుణే కేంద్రంగా సాగిన ఈ దందా బీహార్, రాజస్థాన్, తెలంగాణ మీదుగా దేశమంతటా పాకింది. హవాలా మార్గంలో వందల కోట్లు చేతులు మారినట్లు బ్యాంకు లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి.

అక్షర యజ్ఞంలో ‘అపవిత్ర’ హస్తం:
ప్రశ్నపత్రాల తయారీ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమున్నా, కులకర్ణి వాటిని లోపలికి ఎలా తీసుకెళ్లాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తీసుకెళ్లాడా? లేక ఉన్నతాధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ‘భారత శక్తి’ ఆరా తీస్తోంది. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు, ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని కూడా విచారిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం:
కష్టపడి చదివే విద్యార్థులకు మొండిచేయి చూపుతూ, పైసలున్న వారికే సీట్లు దక్కేలా చేసిన ఈ ‘అక్షర దొంగ’ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కులకర్ణి అరెస్టుతోనే ఈ కథ ముగిసిపోలేదు.. దీని వెనుక ఉన్న రాజకీయ, పరిపాలనా యంత్రాంగంలోని ‘పెద్ద తిమింగలాల’ను బయటకు లాగాల్సిందే.

 "పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోతే మేధావుల కంటే మాఫియానే దేశాన్ని శాసిస్తుంది. కులకర్ణి అరెస్ట్ ఒక ఆరంభం మాత్రమే కావాలి. వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి పురుగులను ఏరిపారేసే వరకు ‘భారత శక్తి’ పోరాటం కొనసాగుతుంది."

About The Author