ఆక్రమణదారుల అండతోనే చెరువుల విధ్వంసం!

  • ముష్కిన్ చెరువు పరిరక్షణకు ‘హైడ్రా’ కఠిన చర్యలు.
  • 17 రోజులు దాటినా ఖాళీ చేయని తాత్కాలిక నివాసాలు
  • పేదలను అడ్డం పెట్టుకుని రియల్టర్ల భూదందా
  • ఒకటి రెండు రోజుల్లో కూల్చివేతలకు అధికారుల హెచ్చరిక

ఆక్రమణదారుల అండతోనే చెరువుల విధ్వంసం!

హైదరాబాద్:

నగరంలోని ముష్కిన్ చెరువు పరిరక్షణకు హైడ్రా (హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ) చర్యలను ముమ్మరం చేసింది. చెరువు పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్) పరిధిలోని భూములను కాపాడేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పేద ప్రజలను ముందుంచి, వారి చేత తాత్కాలిక షెడ్లు వేయించి, చెరువు భూములను కాజేయాలని కొందరు రియల్టర్లు కుట్రలు పన్నుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 29నే నివాసాలను ఖాళీ చేయాలని 10 రోజుల గడువు ఇచ్చినప్పటికీ, శనివారం నాటికి 17 రోజులు గడిచినా కేవలం 10 శాతం మంది మాత్రమే ఖాళీ చేశారు. దీంతో హైడ్రా, రెవెన్యూ, నీటి పారుదల శాఖల సంయుక్త బృందం శనివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడ నివసిస్తున్న వారికి తుది హెచ్చరికలు జారీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది.

*పేదలను అడ్డం పెట్టుకుని రియల్టర్ల మాయాజాలం!
చెరువు ఆక్రమణల వెనుక బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు అధికారులు బట్టబయలు చేశారు. తాత్కాలిక నివాసాలు, దుకాణాలు ఏర్పాటు చేయించి, ఆక్రమణలకు అడ్డుగా పేదలను వాడుకుంటున్నారని అధికారులు తెలిపారు. నిర్మాణ వ్యర్థాలు, మట్టి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తెచ్చి చెరువులో వేస్తూ దాని సహజ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ చెత్తను తగులబెడుతూ చెరువును కలుషితం చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు పరిధిలోని భూమి తమదేనని వాదించే వారికి ఆరు నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని, కానీ ఆ విషయాన్ని వారు పేదలకు చెప్పకుండా దాచారని అధికారులు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాల నిబంధనల ప్రకారమే బాధితులకు తగిన సమయం ఇచ్చామని, ఈ భూమిపై హక్కులు ఉన్నవారు బదలాయించదగిన అభివృద్ధి హక్కుల (టీడీఆర్) ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉన్నప్పటికీ, అడ్డదారిలో చెరువును మింగేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
### లెక్క తేల్చిన అధికారులు: 52.20 ఎకరాల చెరువు భూమి
లక్షలాది మంది నివసించే ప్రాంతంలో ఉన్న ముష్కిన్ చెరువు వైశాల్యాన్ని గతంలోనే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్) పరిధి కింద 52.20 ఎకరాలుగా తేల్చింది. రక్షణ వలయం (బఫర్ జోన్)తో కలిపితే ఇది దాదాపు 62 ఎకరాల వరకు ఉంటుందని నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ భూమిపై ప్రైవేటు శక్తుల కన్ను పడటంతో చెరువు క్రమంగా కుంచించుకుపోతోంది.

 * వివాదాస్పద భూముల వివరాలు:
1 పయనీర్స్ సంస్థ ఆధీనంలో ఉందని వాదిస్తున్న భూమి | 18.00,
2 రైతులకు చెందినదిగా చెబుతున్న భూమి 12.00,
3 ఇతర వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న భూమి 04.20 ,
4.మొత్తం ప్రైవేటు వివాదాల పరిధిలోని భూమి 34.20,
5.ప్రభుత్వ శిఖం భూమి 21.00,
మొత్తం: ముష్కిన్ చెరువు పరిధి 55.20 

నిబంధనలు బేఖాతరు:
అడ్డుకట్ట వేస్తామన్న ‘హైడ్రా’
నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా.. అందులో కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి తప్ప ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. భూమి స్వరూపాన్ని మార్చకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఒక బడా నిర్మాణ సంస్థ చెరువులో మట్టి నింపి, వరద నీరు వచ్చే కాలువలను మూసివేసి సరిహద్దు గోడను నిర్మించింది. గతంలో అధికారులు ఈ గోడను కూల్చివేసినా, రియల్టర్లు మళ్లీ అక్కడ నిర్మాణాలకు సిద్ధమవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముష్కిన్ చెరువును ఆక్రమణల నుంచి విముక్తం చేసి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఆక్రమణదారులు తక్షణమే ఖాళీ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

About The Author