మద్యం మత్తులో స్టీరింగ్ పడితే.. జైలు గది దాటాల్సిందే!
- మల్కాజ్‌గిరిలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
- వారాంతపు వేటలో దొరికిన 323 మంది మందుబాబులు.
- ప్రమాదకర స్థాయిలో రోడ్లపైకి.. అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే!
మల్కాజ్‌గిరి:
వారాంతపు విందులు.. వినోదాల పేరిట మద్యం మత్తులో మునిగితేలి, అదే మత్తులో వాహనాలు నడుపుతూ పరుల ప్రాణాల మీదకు తెస్తున్న కేటుగాళ్లపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు మద్యం తాగి దొరికిపోయారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 323 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరినీ త్వరలోనే న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
*ప్రమాదకర స్థాయిలో ‘మత్తు’..
రక్తంలో ఆల్కహాల్ శాతం (బీఏసీ) ఆధారంగా నిందితులను పోలీసులు వర్గీకరించారు. కొందరైతే సాధారణ పరిమితిని దాటి, ప్రాణాంతక స్థాయిలో మద్యం సేవించి వాహనాలు నడపడం గమనార్హం.
36 మి.గ్రా. నుంచి 200 మి.గ్రా. లోపు: 297 మంది
201 మి.గ్రా. నుంచి 300 మి.గ్రా. లోపు: 22 మంది
301 మి.గ్రా. నుంచి 550 మి.గ్రా. లోపు (అత్యంత ప్రమాదకరం): 04 గురు,
*ద్విచక్ర వాహనాలదే పైచేయి..!
వారాంతపు తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎప్పటిలాగే ద్విచక్ర వాహనదారుల సంఖ్యే అత్యధికంగా ఉంది. నిబంధనలు గాలికొదిలేసి రోడ్లపైకి వచ్చిన
వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి:
ద్విచక్ర వాహనాలు 267,
మూడు చక్రాల వాహనాలు (ఆటోలు) 22,
నాలుగు చక్రాల వాహనాలు (కార్లు)33,
భారీ వాహనాలు 01,
మొత్తం 323,
"మద్యం మత్తులో వాహనాలు నడపడం క్షమించరాని నేరం. ఒకవేళ ఎవరైనా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే.. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023 లోని సెక్షన్ 105 (హత్య కానేరని నేరపూరిత నరహత్య) కింద కేసులు నమోదు చేస్తాం. ఈ సెక్షన్ కింద గరిష్టంగా **10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు."
ఉప పోలీసు కమిషనర్ (డీసీపీ), మల్కాజ్‌గిరి.
* గత వారం 14 మంది జైలుకు..
గడిచిన వారంలో (మే 10 నుంచి మే 16 వరకు) మద్యం తాగి వాహనం నడిపిన కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో మొత్తం 194 కేసుల విచారణ పూర్తయింది. నేరం రుజువైన నేపథ్యంలో కోర్టులు నిందితులకు కింది విధంగా శిక్షలు ఖరారు చేశాయి:
*జైలు శిక్షతో పాటు, జరిమానా:14 మందికి,
సామాజిక సేవతో పాటు జరిమానా:* 03 గురికి,
*కేవలం జరిమానా:*177 మందికి,
సమాజ రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనదారులు చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఉప పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
