కలెక్టరేట్ లో అట్టహాసంగా అటుకుల బతుకమ్మ వేడుకలు
సంగారెడ్డి :

బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి ప్రతీక గా నిలిచిందని, మహిళల సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ లోనిర్వహించిన అటుకుల బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, పూలతో అలంకరించి గౌరమ్మ కు పూజలు చేసి అటుకుల బతుకమ్మ సంబురాలను ప్రారంభించారు .రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ వేడుకలు ,పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు . ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడారు . బతుకమ్మ పండుగ లో ప్రధానంగా పూలతో గౌరమ్మను పూజించడం ప్రత్యేకత అని,ఇతర పండుగల మాదిరి నైవేద్యాల కంటే పూలనే దేవతారాధనకు సమర్పించడం బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పూలను పూజించే మన సంస్కృతి గొప్పదన్నారు. స్త్రీల ఐక్యత, కుటుంబ సఖ్యతకు ప్రతీకగా నిలిచే అటుకుల బతుకమ్మ లో కలెక్టర్, చిన్నారులు, మహిళలతో కలిసి పాటలు పాడి, ఆటలాడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జెడ్పిసిఒ స్వప్న, డిపిఓ సాయి బాబా, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి , పంచాయతీ రాజ్ శాఖ మహిళా ఉద్యోగులు, చిన్నారులు, ఇతరశాఖల మహిళా ఉద్యోగులు తదితర పాల్గొన్నారు.
