నది తీరాలకు, శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం

WhatsApp Image 2025-11-17 at 6.06.19 PM

మణుగూరు : 
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారజామున 4 గంటల నుండి గోదావరి నది తీరాలకు, శైవ క్షేత్రాలు భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా కార్తీక పౌర్ణమి నాడే కాకుండా, ఈ ఆఖరి రోజు మండలంలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నేతిలో ముంచిన 365 వత్తుల దీపాలను పసుపు, కుంకుమలతో అలంకరించి గోదావరిలో వదిలారు. గోదావరి తీరం శివ, కేశవుల నామంతో పులకించింది. పరిసరాల్లో ఉన్న శైవ క్షేత్ర ఆలయాలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచారు. ఉదయం 4 గంటల నుండే శివ లింగాలను దర్శించుకునేందుకు భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. శివాలయాలలో పార్వతి పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముందుగా భక్తులు ధ్వజ స్తంభాల వద్ద పవిత్ర దీపాలను వెలిగించి దీప పూజలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న రావి చెట్టు, జమ్మి చెట్టు, పుట్టల వద్ద గుడ్లు, పాలు పోసి,  నువ్వులతో కలిపిన సలివిడిని నాగేంద్రుడికి నైవేద్యంగా సమర్పించారు. శివయ్యకు భక్తులు వెంట తీసుకు వచ్చిన పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభుగా వెలసిన పాతాళ నిలకంఠేశ్వర స్వామికి గర్భగుడిలో శివలింగానికి ఆలయ అర్చకులు రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. బహుళ త్రయోదశిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటల సమయంలో అర్చకులు నందీశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీ నిలకంఠేశ్వర స్వామి ద్విలింగ దర్శనమిచ్చారు. భక్తులు ద్విలింగ స్వరూపుడిని దర్శించుకొని తరించి పోయారు. హరి హారసుతులకు ప్రీతికరమైన మాసం కావడంతో నెల రోజుల పాటు శివ నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ భక్తులు నియమ నిష్ఠలతో గడిపారు. ఈ పవిత్ర మాసంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం నేటితో ముగియనుండడంతో మళ్లీ ఏడాది పాటు ఈ వైభవం కోసం భక్తులు వేచి చూడనున్నారు. 

Read More ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..

About The Author