అక్రెడిటేషన్ల జారీలో సర్కారు ఫెయిల్యూర్
- జర్నలిస్టుల సమస్యలపై కొట్లాడదాం
- టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపు
మహబూబ్‌నగర్
జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ భవన్‌లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ధ్వజమెత్తారు. సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, కనీసం కార్డులు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు.
హామీలు ఏమయ్యాయి?
జర్నలిస్టుల పట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా వివక్ష, నిర్లక్ష్యం కొనసాగుతోందని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. "అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మాటలు చెబుతున్నారే తప్ప, చేతల్లో కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైంది?" అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఊసే లేదని, చిన్న, మధ్య తరహా పత్రికలకు రెండేళ్లుగా అడ్వర్టైజ్‌మెంట్ బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి, ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిటి అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్ కుమార్, ఎం. యాదగిరి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మోయిజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ రఫీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, కార్యదర్శి ఎం. గోపాల్, కోశాధికారి నర్సింహులు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఎం. రవికుమార్, కో-కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

