ప్రజా రక్షణలో ‘హైడ్రా’ జోరు: ఒకవైపు భూముల రక్షణ.. మరోవైపు ప్రమాదాల నివారణ

  • శంషాబాద్‌లో రూ. 90 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం* 
  • ఎస్.ఆర్. నగర్‌లో శిథిలావస్థకు చేరిన భారీ వాటర్ ట్యాంక్ సురక్షితంగా కూల్చివేత

ప్రజా రక్షణలో ‘హైడ్రా’ జోరు: ఒకవైపు భూముల రక్షణ.. మరోవైపు ప్రమాదాల నివారణ

హైదరాబాద్:

నగరంలో అక్రమ ఆక్రమణల తొలగింపుతో పాటు ప్రజా రక్షణే ధ్యేయంగా హైడ్రా (HYDRAA) తన దూకుడును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన వేర్వేరు ఆపరేషన్లలో అటు విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, ఇటు నివాస ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన పాత నిర్మాణాలను తొలగించి ప్రజలకు భరోసానిచ్చింది.

రూ. 90 కోట్ల భూమికి ఫెన్సింగ్

శంషాబాద్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 626/2లో గల సుమారు 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

 నేపథ్యం: మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో 166 ఎకరాలను గతంలోనే అటవీ అభివృద్ధి సంస్థకు కేటాయించగా, మిగిలిన 9.05 ఎకరాలపై కొందరు వ్యక్తులు నిజాం కాలం నాటి హక్కులంటూ కోర్టును ఆశ్రయించారు.

 నిబంధనల ఉల్లంఘన: ఈ భూమిపై హైకోర్టు 'యథాతథ స్థితి' (Status Quo) విధించినప్పటికీ, తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా భూమిని చదును చేసి లే-అవుట్లుగా మార్చారు. అంతేకాకుండా ప్రీకాస్ట్ గోడలు నిర్మించి విక్రయాలకు కూడా ప్రయత్నించినట్లు ఫిర్యాదులు అందాయి.WhatsApp Image 2026-04-22 at 19.06.41 (2)

 హైడ్రా చర్య: రంగారెడ్డి కలెక్టర్, మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన హైడ్రా, బుధవారం అక్కడ ఉన్న అక్రమ కంచెలను, నిర్మాణాలను తొలగించింది. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేసింది.

65 ఏళ్ల నాటి ట్యాంక్ నేలమట్టం
సంజీవరెడ్డి నగర్ (ఎస్.ఆర్. నగర్) నివాసితులను దశాబ్ద కాలంగా భయపెడుతున్న పాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను హైడ్రా సురక్షితంగా కూల్చివేసింది.

 ముప్పు తప్పింది: 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో, 80 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్యాంక్ 65 ఏళ్ల నాటిది. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని జేఎన్టీయూ నిపుణులు ధ్రువీకరించడంతో 15 ఏళ్లుగా దీన్ని వినియోగించడం లేదు. చుట్టూ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటంతో ఇది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన చెందేవారు.

 సాంకేతిక ఆపరేషన్:
జలమండలి విజ్ఞప్తితో హైడ్రా నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఆపరేషన్ ప్రారంభించి, రెండు భారీ హిటాచీలు, ఐరన్ రోప్‌ల సహాయంతో కేవలం 4 గంటల్లోనే ఎలాంటి నష్టం జరగకుండా ట్యాంక్‌ను నేలమట్టం చేశారు.
నిర్దేశించిన పరిధిలోనే నిర్మాణం పడేలా జాగ్రత్తలు తీసుకోవడంతో చుట్టుపక్కల నివాసితులు, కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో అండగా నిలుస్తూ ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.WhatsApp Image 2026-04-22 at 19.09.45

About The Author