హైదరాబాద్ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో గందరగోళం -మీడియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో గందరగోళం  -మీడియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్:

హైదరాబాద్‌ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తీవ్ర అభ్యంతరాలకు, వివాదాలకు దారి తీసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ లాంటి ప్రధాన మీడియా సంస్థలను విస్మరించి, కమిటీలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల అధికారుల వైఖరిపై మీడియా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా, ఫోటో జర్నలిస్టుల యూనియన్, ఉర్దూ జర్నలిస్టుల యూనియన్, వీడియో జర్నలిస్టుల యూనియన్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లు ప్రతిపాదించిన సభ్యులను లెక్కల్లోకి తీసుకోకుండా, తమకు అనుకూలమైన వ్యక్తులకు, పైరవీకారులకు మాత్రమే అధికారులు కమిటీలో సభ్యులుగా నియమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని సంవత్సరాల తరబడి మీడియా రంగానికి సేవలందిస్తున్న అనుభవజ్ఞులయిన జర్నలిస్టులను విస్మరించి, కొత్తగా ఎంపిక చేసిన సభ్యుల నియామకం మరింత వివాదాస్పదంగా మారింది.ఈ విషయంపై పలువురు సీనియర్ పాత్రికేయులు, ప్రధాన యూనియన్ల బాధ్యులు అధికారులను ప్రశ్నిస్తే, బాధ్యతా రహితమైన సమాధానాలు ఇవ్వడం ఇంకా విస్మయం కలిగిస్తుంది. డిపిఆర్ఓను సంప్రదిస్తే “తమ ప్రమేయం లేదని, కలెక్టర్‌కి తెలుసు” అంటూ తప్పుకోవడం, కలెక్టర్‌ను సంప్రదిస్తే “తమకు పైస్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకే కమిటీని ఏర్పాటు చేసాం” అంటూ విషయాన్ని దాటేయడం గందరగోళాన్ని మరింత పెంచుతోంది.కలెక్టరేట్‌ బీట్ బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభవజ్ఞులైన ప్రముఖ పత్రికల సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కల్పించకుండా కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై పారదర్శకత లేకపోవడం, పక్షపాత ధోరణి కనిపిస్తుండడంతో మీడియా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తక్షణమే కమిటీని పునర్మించి, అనుభవం ఉన్న జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

About The Author