కొత్త ప్యాడి క్లినింగ్ మిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి - ఉపసర్పంచ్ రుద్రారం యాదగిరి
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, వైస్ చైర్మన్ కడదూరి నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు, సర్పంచ్‌లు మరియు పాలకవర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పద్మనాభునిపల్లి ఉపసర్పంచ్ రుద్రారం యాదగిరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్యాడి క్లినింగ్ మిషన్ గత కొన్ని సంవత్సరాలుగా తరచూ పాడవుతూ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా కొనుగోలు సీజన్‌లో మిషన్ సరిగా పని చేయకపోవడంతో రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.మిషన్ పనిచేయకపోవడంతో రైతులు తప్పనిసరిగా ప్రయివేట్ మిషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అదనపు ఖర్చులు భరించాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను గమనించిన ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి వెంటనే స్పందిస్తూ, రైతుల సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటామని తెలిపారు. త్వరితగతిన కొత్త ప్యాడి క్లినింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసి రైతులకు ఉపశమనం కలిగించేందుకు కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
