కమాండర్ రూపి కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ
- - రూపి అలియాస్ భాగ్య మృతి కలిచివేసింది
- - బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి
సిద్దిపేట:
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు కమాండర్ రంగమైన భాగ్య అలియాస్ రూపి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, రూపి అలియాస్ భాగ్య మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఉద్యమంలో కొనసాగుతూ కుటుంబాన్ని పక్కనబెట్టి ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి ఈ విధంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.ప్రభుత్వాలు లొంగుబాటు అవకాశాలు కల్పిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, సమాజం మార్పు దిశగా సాగుతున్న వేళ ఆమె కూడా లొంగిపోయి ప్రజల మధ్య ఉండి సేవలు అందించి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదేమో కాదని అభిప్రాయపడ్డారు.
భాగ్య కుటుంబం ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉందని పేర్కొంటూ, వారికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం అందజేశారు. ఇతరులు కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, మాజీ ఎంపీటీసీ ద్వారా స్వామి, ద్వారా మల్లయ్య, రంగబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు.
