
ఉమ్మడి వరంగల్ :
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలకు అర్జీలను అందజేశారు. ప్రజలు వినతి పత్రాలను అందజేస్తూ సమస్యలను కలెక్టర్ కు తెలియజేయగా ఓపిగ్గా విన్నారు. వెంటనే సంబంధిత అధికారులను ప్రజలు అందించిన వినతులపై పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, ఇతర శాఖలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు 158 అర్జీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, డి ఆర్ డి ఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.