రంగానాయకుల గుట్టలో సీసీ రోడ్ల పనుల పరిశీలన: కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్:
హయత్ నగర్ డివిజన్‌లోని రంగానాయకుల గుట్ట కాలనీలో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీవాసులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యల పరిష్కారానికి ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురద, నిలిచిన నీటి కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కాలనీలో ఇతర మౌలిక వసతుల కల్పనకు కూడా దశలవారీగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, నాయకులు కుమార్, ఆకుల అరుణ్, ఎర్ర ప్రేమ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
