అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత.

  • వేసవి దృష్ట్యా నగరవ్యాప్తంగా హైడ్రా అవగాహన కార్యక్రమాలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరిక.

అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత.

​హైదరాబాద్‌ :

ఎండకాలం సమీపిస్తున్న తరుణంలో నగరంలో అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా (HYDRAA) దృష్టి సారించింది. నిప్పురవ్వ చిన్నదైనా భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉన్నందున, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సూచించారు. ఇప్పటికే నగరంలోని పలు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేపట్టిన హైడ్రా, నిబంధనలు పాటించని కొన్ని షాపులను సీజ్ చేసింది. వ్యాపార సంఘాల విజ్ఞప్తి మేరకు లోపాలను సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ గడువులోగా భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

​అవగాహనతోనే భద్రత:

అగ్ని ప్రమాదాల నివారణపై నగరవ్యాప్తంగా సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యాపారులు, నివాసితులు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇవే:
​1. సెల్లార్లలో నిల్వలు వద్దు:
​సెల్లార్లను కేవలం వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలి. వాటిని గోదాములుగా మార్చి వస్తువులు నిల్వ చేయడం, గ్రిల్స్ వేసి తాళాలు వేయడం చట్టరీత్యా నేరం.

​సెల్లార్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలి. అక్కడ వాచ్‌మెన్ నివాసాలు ఉండకూడదు. వంట చేయడం, క్యాంటీన్ల నిర్వహణ వంటివి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి.

​2. దారులను ఖాళీగా ఉంచాలి:
​అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా బయటకు వెళ్లే దారులు (Exit Routes), ర్యాంపులు, మెట్ల మార్గాల్లో వస్తువులను అడ్డుగా పెట్టకూడదు.
​ప్రమాద సమయంలో లిఫ్టులను వాడకూడదు కాబట్టి, మెట్ల మార్గం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఎగ్జిట్ బోర్డులను స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి.

​3. విద్యుత్ భద్రతే ముఖ్యం:
​ఐఎస్‌వో (ISO) గుర్తింపు పొందిన విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులనే వాడాలి. పాతబడిన వైరింగ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి.

​విద్యుత్ సర్క్యూట్‌లపై ఓవర్‌లోడ్ పడకుండా చూసుకోవాలి. ప్యానల్ బోర్డుల వద్ద నిప్పురవ్వలు పడినా ప్రమాదం జరగకుండా కంకరతో కూడిన ప్రత్యేక చాంబర్లు నిర్మించాలి.

​4. రక్షణ పరికరాల ఏర్పాటు:
​ప్రతి వ్యాపార సముదాయంలో స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఉండాలి.
​ఈ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. సిబ్బందికి వాటిని వాడటంలో అవసరమైన శిక్షణ ఇవ్వాలి.

​ఫిర్యాదు చేయండిలా..

​మీ పరిసరాల్లో ఎక్కడైనా అగ్ని భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గమనిస్తే వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్ నంబరు 9000113667 కు ఫోటోలు, వీడియోలు లేదా లొకేషన్‌ను పంపాలని కమిషనర్ కోరారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ సహాయం కోసం 101 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

About The Author