పంచుకుంటే పెరిగేది ఆనందం
- ఈ హిందువులకి నోముల పిచ్చి ఏమిటండి?
- ఈ కాలంలో కూడానా..! ఈ పేరంటాలు, పట్టు చీరలు, వాయినాల హడావిడి వేలం వెర్రి..!
- ఇదంతా వృధా కాలయాపన, డబ్బు ఖర్చు తప్ప వీటితో ఒరిగేదేమీ ఉండదు.
- ఆధ్యాత్మికత ఎక్కడుంది? హేతుబద్ధత ఎక్కడుంది?
- అని కొందరు మేధావులు ఈసడించుకుంటూ చేసే విమర్శలకు ఈ వ్యాసం చక్కని సమాధానం.
ఈ ప్రపంచంలో నిరంతరం ఏవేవో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మార్పు అనేది ప్రకృతి సహజం. నిన్నటిలా నేడు ఉండదు. నేటిలా రేపు ఉంటుందని ఊహించలేం! అయినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నుండి, ఇన్ని కోట్ల మంది ఎవరి నిర్బంధమూ లేకుండా, స్వచ్ఛందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా హిందూ మహిళలు తమ నోములేవో తాము నోచుకుంటున్నారంటే, వాళ్లకు వాటి వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతూ ఉండి ఉండాలి. కోరుకున్న కోరికలు తీరటం కావచ్చు. మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, తృప్తి, ధైర్యం, ఉత్సాహం పెరగటం కావచ్చు. ఐహిక ఆముష్మిక కోరికలు తీరటం కావచ్చు. ఆముష్మిక చింతన మీదకు వారి ధ్యాస మళ్లటం కావచ్చు. ఇలాంటి ప్రయోజనం ఏదీ లేకుండా ఎవరైనా ఏ పనైనా చేస్తారనడం అటు హేతువాదానికి, ఇటు అనుభవానికి రెండింటికి విరుద్ధమే అవుతుంది కదా!
:: ఆత్మీయతలను పెంచే ఆధ్యాత్మికత ::
తమ భోగభాగ్యాలు కష్టసుఖాలు వీలైనన్ని సందర్భాలలో సాటివారితో పంచుకోవాలన్న సాంఘిక బాధ్యతను, నియమాన్ని ఆధ్యాత్మికతతో పెనవేసే కార్యక్రమాలను అజ్ఞానము, అవివేకము అనలేము. ప్రపంచ వ్యాప్తంగా కొత్తొక వింతగా కనిపిస్తూ నిత్య ఉత్సవాలు జరుపుకునే ఈ రోజులలో అసలే అనలేం! పురుష ప్రయత్నం వదిలేసి పుణ్యకాలమంతా నోములు, వ్రతాలు అంటూ కూర్చుంటే పురోగతి ఎలా సాధిస్తాం? అని, మరొక అభ్యంతరం వినిపిస్తూ ఉంటుంది. కానీ సాధారణంగా ఎవరు అలా కూర్చోరు. ఇది చేస్తే అది చేయాల్సిన పనిలేదని కాదు. ధనార్జన చేయగోరేవారు స్నాన, పానాలకు, ఆహార, విహారాలకు సమయం కేటాయించరా? వాస్తవానికి పూజలు, నోములు, ప్రార్థనలు, వ్రతాలు పురుష ప్రయత్నానికి పరమాత్ముని అనుగ్రహం కూడా తోడైతే విజయం తథ్యం! అన్న నమ్మకానికి ఆచరణ రూపాలు మాత్రమే! ఈ నోములన్నింటిలోనూ యధాశక్తి బంధుమిత్రులను ఆహ్వానించి సత్కరించటం, కానుకలు పంచుకోవడం కనిపిస్తుంది. సాటివారిని పేరంటాల పేరుతో సాదరంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఆహ్వానించటం.. వాళ్లూ అదే విధంగా ఆత్మీయంగా, అభిమానిగా వచ్చి నోము నిర్వహణలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి, సౌజన్యం, సహృద్భావం ప్రకటించి వెళ్లడం జరుగుతూ ఉంటాయి.
సనాతన హైందవ సంస్కృతిలో ఇచ్చే వారిది పై చేయి పుచ్చుకునే వారిది క్రింది చేయి కాదు. ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ముత్తయిదువులను గొప్ప చేసి దేవతగా భావించి పూజించినట్టు పూజించి, కానుకలు సమర్పిస్తారు ఈ సంప్రదాయాల వెనుక ఉన్న ఔన్నత్యం సర్వ సమత్వ భావన గమనించదగినవి. సాంఘిక సంబంధాలు బలపరిచే ఈ కార్యక్రమాలకు ప్రయోజనం లేదని ఏవో పిచ్చి సిద్ధాంతాలు చేసుకొని వాటిని సమర్థించుకోవడం అవివేకమే అవుతుంది. "సాధించిన దాన్ని త్యాగ, వైరాగ్య బుద్ధితో అనుభవించు అంటుంది ఉపనిషత్తు. అందుకే హైందవ మహిళలు నోములలో వాయినాలు పెట్టిపోతలు వేడుకలు ఆ దృష్టితో చేస్తారని విమర్శకులు గమనిస్తే సరి.
"సాహిత్య కళా విభూషణ" స్వర్ణ నంది పురస్కార గ్రహీత
చౌడూరి నరసింహారావు, సాహిత్య, సామాజిక విశ్లేషకులు
భాగ్యనగరం, 9705100788