మణుగూరులో శైవ క్షేత్రాలకు కార్తీక శోభ

- పోటెత్తిన భక్త జనసందోహం
- శివ,కేశ నామాలతో పులకించిన ఆలయాలు
- మార్మోగిన శివనామస్మరణం
- దీపాలు వెలిగించి దీపారాధన చేసిన మహిళలు

WhatsApp Image 2025-11-05 at 7.00.42 PM

మణుగూరు : 
మండలంలోని శైవ క్షేత్రాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పాత మణుగూరు లోని స్వయంభుగా వెలసిన శ్రీ నిలకంఠేశ్వర స్వామి, కొండాయిగూడెంలోని శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాధ లింగేశ్వర స్వామి, గుట్టమల్లారం లోని గాయత్రి మాత ఆలయంలో ప్రతిష్టించిన శివాలయం, సమితిసింగారం పంచాయితీ లోని అశోక్ నగర్ లో వెలసిన భవాని శంఖర్ ఆలయం, పివి కాలనీ లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివ, కేశవులను ఆరాధించే మాసం కార్తీక మాసం. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని భక్తులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మండల పరిసర ప్రాంతాల నుండి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వందలాది మంది భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుండి పుష్కర ఘాటులు వద్ద గోదావరిలో  స్నానమాచరించి పునీతులయ్యారు. అనంతరం నేతిలో ముంచిన 365 వత్తుల దీపాలను పసుపు, కుంకుమలతో అలంకరించి గోదావరిలో వదిలారు. గోదావరి తీరం శివ, కేశవుల నామంతో పులకించింది. గోదావరి తీరం భక్తులతో భక్త గోదావరిగా మారింది. మండల ప్రజలకు, భక్తులకు పరిసరాల్లో ఉన్న శైవ క్షేత్ర ఆలయాలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల నుండి భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచారు. ఉదయం 4 గంటల నుండే శివ లింగాలను దర్శించుకునేందుకు భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. శివాలయాలలో పార్వతి పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ధ్వజ స్తంభాల వద్ద పవిత్ర దీపాలను వెలిగించి దీప పూజలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్ద గుడ్లు, పాలు పోసి,  నువ్వులతో కలిపిన సలివిడిని నాగేంద్రుడికి నైవేద్యంగా సమర్పించారు. శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభుగా వెలసిన పాతాళ నిలకంఠేశ్వర స్వామిని మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి దంపతులు, సిఐ దంపతులు దర్శించుకున్నారు. గర్భగుడి ఆలయంలో శివలింగానికి ఆలయ అర్చకులు రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీ నిలకంఠేశ్వర స్వామి ద్విలింగ దర్శనమిచ్చారు. భక్తులు ద్విలింగ స్వరూపుడిని దర్శించుకొని తరించి పోయారు. దేవస్థానం అధీనం లో ఆలయాలకు కమిటీ వారు, నిర్వాహకులు దేవాలయాలకు  విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. భక్తులకు అసౌకర్యం, ఎటువంటి అవాంతరాలు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు జ్వాల తోరణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆధ్వర్యంలో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, భక్తులు తోపులాట జరగకుండా క్యూ లైన్లో వెళ్లేందుకు సహకరించారు. 

Read More కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాలలో విజయం సాధిస్తారు

About The Author