రెండు కోట్ల రూపాయలతో పురాతన ఆలయం పునర్నిర్మాణం.....
ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో కాకతీయ కాలంనాటి పురాతన శివాలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

ఖమ్మం : ::
ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గంధసిరి గ్రామం చాలా ప్రత్యేకమైందని, కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మల్లేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం మన అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ అందించారని తెలిపారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రపంచంతో పోటీపడుతూ పెట్టుబడులను ఆకర్షించడం వంటి అనేక ఆశలతో ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని, ఆ సమయంలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేశానని, ఆ సమయంలో గంధసిరి గ్రామం సందర్శన లో శిథిలావస్థలో ఉన్న శివాలయం గమనించడం జరిగిందని అన్నారు.
కాకతీయ కాలం నాటి శివాలయం పునర్నిర్మాణ చేసే అవకాశం కల్పించాలని ఆ పరమేశ్వరుని ఆ రోజులలో ప్రార్థించామని, దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు కోట్ల రూపాయలతో శ్రీ సుందర మౌలేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు.
మహాభారత సమయంలో కౌరవులు మరణించిన తర్వాత గాంధారి ఇదే గ్రామానికి వచ్చి ఇక్కడ శివుని స్థాపించి పూజించిందని ఇక్కడి శాసనాలు చెబుతాయని తెలిపారు. ప్రతాప రుద్రుడి సమయంలో ఇక్కడ పటిష్టమైన దేవాలయం నిర్మించడం జరిగిందని తెలిపారు. చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మించే అదృష్టం లభించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇల్లు లేని పేదలు 10 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పాలనలో ఎదురుచూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తన చేయి పట్టుకొని తెలిపిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే పాదయాత్ర సందర్భంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చాను, నీ ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నాం, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు తాను వచ్చే క్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కలిసి వారితో ఆనందాన్ని పంచుకున్న విషయాన్ని వివరించారు.
ఈ ప్రభుత్వంప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో దోపిడీకి గురి కానివ్వం, ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అత్యంత ప్రమాదకరం అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం అన్నారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా అధికారంలోకి రాగానే బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచేందుకు కమిటీ వేసి 20% డైట్, 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చదువుకునే ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మిస్తున్నాం అన్నారు. 2500 కోట్ల పెట్టుబడితో 25 ఎకరాల్లో ప్రతి పాఠశాల నిర్మాణం జరుగుతుంది అన్నారు. ఇందులో భాగంగా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి అన్నారు.
మహిళలంతా ఆత్మగౌరవంతో బతకాలని వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం, ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరా మహిళా క్రాంతి పథకాన్ని గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు పూర్తిగా ఎత్తివేశారు కానీ మహిళల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఒక కుటుంబాన్ని నిటారుగా నిలబెట్టే శక్తి మహిళకే ఉంది వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
మధిర నియోజకవర్గంలో 60 వేల మంది మహిళా సభ్యులు ఉన్న ఇందిరా మహిళ డైరీ దేశానికి తలమానికంగా ఉండబోతోందనీ డిప్యూటీ సీఎం వివరించారు. నియోజకవర్గంలోని ఒక్కొక్క మహిళకు రెండు గేదలు పంపిణీ చేసి దేశంలోనే ప్రతిష్టాత్మక డెయిరీనీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా గేదెల పంపిణీ ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం గ్రూప్ వన్, టు పరీక్షను నిర్వహించలేకపోయారు అని ఎద్దేవా చేశారు. పంటలు పండించి రైతులు, కూలి చేసి భూమి లేని వారు, వెల్డింగ్ పనులు చేసుకున్న వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం చెమటోడ్చి హైదరాబాదులో కోచింగ్ సెంటర్లకు పంపితే ఆ పది సంవత్సరాలు కాలంలో గ్రూప్- 1, గ్రూప్ 2 నిర్వహించలేకపోయారు అన్నారు. ఫలితంగా పోటీ పరీక్షలకు సిద్ధమైన యువత వయసు కూడా అయిపోయి పోగు చేసి పిల్లల కోసం పంపించిన తల్లిదండ్రులు ఆవేదనతో మిగిలిపోయారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియామక పత్రాలు సైతం అందించాము అన్నారు. గ్రూప్ 2 నియామకాలు జరిపి పత్రాలు సైతం అందించాము అని తెలిపారు.
గత పాలకులు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయలేకపోయారు కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు.
గుడి, బడి, మార్కెట్ కు మహిళలు ఎక్కడికి వెళ్లినా రూపాయ ప్రయాణం ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ సన్న బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో 55 రూపాయలు పలుకుతుంది అన్నారు. ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఈ ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు.
ఎక్కడ ఉన్న ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాను, మధిర నియోజకవర్గ ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తాను అన్నారు. మధిర ప్రజల ఇంటి బిడ్డగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, కాకతీయ కాలంనాటి పురాతన శివాలయం నేడు పునర్నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, ఎంతో ప్రాచీనమైన దేవాలయం డిప్యూటీ సీఎం చోరువతో దేవాదాయ శాఖ ద్వారా 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు.
శివాలయం పునర్నిర్మాణ పనులను దేవాదాయ శాఖ వారు వెంటనే ప్రారంభించి గంధసిరి గ్రామ ప్రజలకు ఆలయం త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ కోరారు. ఆలయ నిర్మాణ పనులను గ్రామ ప్రజలు పర్యవేక్షించాలని, మంచి శివాలయం గ్రామంలో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, మార్కెట్ కమిటీ చైర్మన్ లు అంబటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
