రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: కప్పర ప్రసాదరావు

  • *బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం
  • *కేటీఆర్ సోషల్ మీడియాలో హీరో… ప్రజల్లో జీరో
  • *బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తీవ్ర విమర్శలు

రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: కప్పర ప్రసాదరావు

*హైదరాబాద్:
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన హీరో అని, ప్రజల్లో ఆయనో జీరో అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరిందని, ఉనికిని కాపాడుకోవడానికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ఉపఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారు:
గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను ప్రసాదరావు గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లోనే కేసీఆర్ కుటుంబానికి ప్రజలు ఓటమి రుచి చూపించారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి, దళిత బంధు ప్రకటించినప్పటికీ ప్రజలు బీజేపీ వైపే నిలిచారని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రజలు గట్టి హెచ్చరికలు పంపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌తో సమానంగా నిలిచిందని, బీఆర్ఎస్‌కు మాత్రం ప్రజలు గుండు సున్నా చుట్టారని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులను మోసం చేసిన బీఆర్ఎస్:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే బీజేపీ బలం ఏంటో రుజువైందని ప్రసాదరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి హిందువులను అవమానించిందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను బీఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా వంచించిందని విమర్శించారు. మరోవైపు బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు వంటి నాయకులు స్వయంకృషితో ఎదిగారని.. కుటుంబ రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చిన వారికి వీరి గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.

దేశ భద్రతే బీజేపీ ప్రాధాన్యత:
ఓటర్ల జాబితాలో ఉన్న డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, అక్రమంగా దేశంలోకి చొరబడిన వారి పేర్లను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని ప్రసాదరావు పేర్కొన్నారు. దేశ భద్రత, దేశ భవిష్యత్తు మాత్రమే బీజేపీకి ముఖ్యమని స్పష్టం చేశారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. గోవా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులు కూడా బీజేపీకి మద్దతు పలికారని గుర్తుచేశారు. ప్రస్తుతం బీహార్, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోనూ పార్టీ శరవేగంగా బలోపేతమవుతోందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ముగిసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అంతం కూడా దగ్గరలోనే ఉందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

About The Author