
కరీంనగర్ :
సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ నుంచి పదవ గురువు గురు గోవింద్ సింగ్ వరకు ప్రతి ఒక్కరూ సమాజ హితం, ధర్మ స్థాపన రక్షణ కోసం పనిచేశారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి తెలిపారు. గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ బాధ్యులు పట్టణంలోని గురుద్వారాను సందర్శించి , ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా బూర్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ సిక్కు గురువుల బోధనలన్నీ దేశ హితం కోసం కొనసాగాయన్నారు. సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేగ్ బహుదూర్ మత స్వేచ్ఛ కోసం అమరులయ్యారని తెలిపారు. ముఖ్యంగా పదవ గురువు గురు గోవింద్ సింగ్ బోధనలు ధైర్యం , సమానత్వం , నిస్వార్ధ సేవల కోసం కొనసాగాయని ఆయన కొనియాడారు. గురు ప్రతి గోవింద్ సింగ్ భారతీయ సంస్కృతి , వారసత్వానికి, ధర్మ రక్షణ కోసం చేసిన సేవలు మరువలేనివన్నారు. గురు గోవింద సింగ్ ను సిక్కు మత నాయకుడిగా మాత్రమే కాకుండా భారతదేశ గొప్ప యోధుడిగా కీర్తించబడ్డారన్నారు. ముఖ్యంగా గురు గోవింద్ ను భారతీయ ఆధ్యాత్మిక నాయకుడిగా , భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఆయనను చూస్తారని తెలిపారు. గురు గోవింద సింగ్ జీవితం అనేక విషయాలలో ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. గురుద్వారా సందర్శించిన వారిలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు రాజశేఖర్ జి , సుధాకర్ జి , బాల రాజ్ జి, భానుజీ తదితరులు పాల్గొన్నారు.