క్షేత్రస్థాయి మున్సిపల్ సిబ్బందికి 'ట్రాఫిక్' సెగ*
చలానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు బి.ఎం.ఎస్ యూనియన్ విన్నపం*
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ట్రాఫిక్ చలానాలు పెను భారంగా మారుతున్నాయి. ప్రజలకు సేవలు అందించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న తమకు ఈ జరిమానాల నుంచి మినహాయింపు కల్పించాలని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (బీఎంఎస్) బుధవారం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది.
గుర్తింపు కార్డులు ఇవ్వాలి
పారిశుధ్య కార్మికులు, ఎస్‌ఎఫ్‌ఏలు, ఈఎఫ్‌ఏఎస్‌లు, శానిటరీ జవాన్లు, పర్యవేక్షకులు, బిల్ కలెక్టర్లు నిరంతరం రోడ్లపైనే ఉంటూ విధులను నిర్వర్తిస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా కొన్నిసార్లు తక్కువ దూరంలో వెళ్లాల్సిన చోట పొరపాటున రాంగ్ రూట్‌లో వెళ్లాల్సి వస్తోందని, ఆ సమయంలో పోలీసులు లేదా సీసీ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి చలానాలు విధిస్తున్నారని యూనియన్ పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి క్షేత్రస్థాయి సిబ్బంది వాహనాలకు ప్రత్యేక ట్యాగ్‌లు ఏర్పాటు చేయాలని లేదా వారిని గుర్తించేలా ప్రత్యేక జాకెట్లు అందజేయాలని కోరింది. ఈ మేరకు ట్రాఫిక్ విభాగంతో మాట్లాడి సిబ్బందికి మినహాయింపునిచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించింది.
*బయోమెట్రిక్ హాజరులో రాయితీ కోరుతూ వినతి*
*మధ్యాహ్నం 1:30కే విముక్తి కల్పించాలి*
పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఎంటమాలజీ విభాగంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు బయోమెట్రిక్ పనివేళల్లో మార్పులు చేయాలని యూనియన్ మరో అభ్యర్థనను కమిషనర్ మరియు ప్రత్యేక అధికారికి అందజేసింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు సమయాలను మార్చాలని కోరింది.
* *లాగిన్ (ప్రవేశం):* ఉదయం 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు.
లాగౌట్ (నిష్క్రమణ):* మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3.00 గంటల వరకు.
*సాంకేతిక సమస్యలతో ఆలస్యం*
ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా హాజరు వేసే సమయంలో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోందని, అందుకే పారిశుధ్య మరియు ఎంటమాలజీ సిబ్బందికి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా హాజరు పరిగణనలోకి తీసుకునేలా అవకాశం కల్పించాలని కోరింది. గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను (సర్క్యులర్ నెం. 371835/Health/UMS/GHMC/2025) ఈ సంవత్సరం కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది.
