
సంగారెడ్డి :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేసి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎన్నికల విభాగపు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఓటర్ మ్యాపింగ్ పురోగతి, భూభారతి దరఖాస్తుల స్థితిగతులనుసమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, బి ఎల్వోలు, బిఎల్వో సూపర్వైజర్ల సమన్వయంతో ఫీల్డ్ స్థాయిలో ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలని సూచించారు.ఏ ఈ ఆర్ ఓ వారిగా రోజువారీ పురోగతి నివేదికలు తీసుకొని రెగ్యులర్‌గా సమీక్షించాలని ఆర్డీవోలకు సూచించారు. జాప్యం జరగకుండా వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలని తహసిల్దార్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. పూర్తి పారదర్శకంగా భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, ఎన్నికల విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.