కాంగ్రెస్ గెలుపు అభివృద్ధికి మలుపు
జూబ్లీహిల్స్ అభివృద్ధిపై సర్కారుకు ప్రత్యేక శ్రద్ధ
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇంచార్జి వెలిచాల
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న వెలిచాల

కరీంనగర్ :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగిన ప్రచార కార్యక్రమంలో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవీన్ యాదవ్ విద్యావంతుడు, స్థానికుడు నిత్యం ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారని పేద ప్రజలకు సాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. తండ్రి బాటలో నడుస్తున్న నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో చేపడుతున్నారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన ఇంటలెక్చువల్ విద్యావంతులు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
