మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
పేదలకు సౌకర్యాలు, సేవలు అందుబాటులో ఉంచాలని సూచన
కరీంనగర్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాత శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసియు, వార్డులు, ఆపరేషన్ థియేటర్ తోపాటు బ్లాక్ లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ లైన్ సమకూర్చుకోవాలని, అవసరమున్న సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పేదలకు అన్ని రకాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని సర్దుబాటు తీసుకోవాలని అన్నారు.
జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓపి విభాగం, స్కానింగ్ గదిని పరిశీలించారు. గర్భిణీలతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీకి టీఫా పరీక్ష తప్పనిసరి అని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గర్భిణీలకు తెలిపారు. ఓపి విభాగంలో ఉక్కపోత వల్ల గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే వీలైనన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో షెడ్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. చెప్పులు విడిచేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీనా పాల్గొన్నారు.