స్వచ్ఛత హరిత పాఠశాలకు యూనిసెఫ్ సహకారం అవసరం
విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
కలెక్టర్ చాంబర్ లో యూనిసెఫ్ బృందంతో సమావేశం..
కరీంనగర్: జిల్లాలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి యూనిసెఫ్ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో యూనిసెఫ్ బృందంతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, సుస్థిర పారిశుధ్యం, పరిశుభ్రత తదితర అంశాలతో పాటు జాతీయస్థాయిలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్ మెరుగుపరిచేందుకు సహకారం అవసరమని అన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, అంగన్వాడి శాఖలలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు యూనిసెఫ్ సహకారం ఉంటుందని బృందం సభ్యులు తెలిపారు.
జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో చేపట్టిన పారిశుధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను గురించి ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన జాతీయ స్థాయి వర్క్ షాప్ లో వివరించినందున కలెక్టర్ ను యూనిసెఫ్ బృందం సన్మానించింది. ఈ సమావేశంలో యూనిసెఫ్ వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్, ఫణీంద్ర, జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ సమన్వయకర్తలు రమేష్, వేణు పాల్గొన్నారు.