నిబంధనలు గాలికి.. అక్రమ నిర్మాణమే ‘లక్ష్యం’!

  • నాగోల్-బండ్లగూడ ప్రధాన రహదారిపై వెలుస్తున్న భారీ వాణిజ్య షెడ్.
  • ఫిర్యాదులు చేసినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
  • ​‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ జోక్యం చేసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

నిబంధనలు గాలికి.. అక్రమ నిర్మాణమే ‘లక్ష్యం’!

​నాగోల్:

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది నానుడి. కానీ, నాగోల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు చూస్తుంటే.. ‘ముడుపులు అందితే చట్టం కళ్లు మూసుకుంటుంది’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లే ప్రధాన రహదారిపై, మోర్ సూపర్ మార్కెట్ సరిగ్గా ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక భారీ వాణిజ్య షెడ్ నిర్మాణమవుతోంది. ఎలాంటి జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా, కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణం ఇప్పుడు స్థానికంగా పెను చర్చకు దారితీసింది. ప్రాథమిక దశలో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో పని స్థానిక జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు..WhatsApp Image 2026-02-04 at 19.48.35

అధికారుల అండతోనే అక్రమ నిర్మాణం?

​ఈ నిర్మాణం ప్రాథమిక దశలో ఉన్నప్పుడే స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయితే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని అడ్డుకోకపోగా, పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నిర్మాణం పూర్తి కావడమే కాకుండా, ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోన్ అధికారులు, నాగోల్ సర్కిల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, టిపిఎస్ సోమేశ్ కుమార్, సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అక్రమ నిర్మాణదారుడి నుంచి భారీగా ముడుపులు అందడం వల్లే అధికారులు మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం విజ్ఞప్తి చేస్తున్నారు.

​ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం..

​వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్న ఈ భారీ గిడ్డంగిలో (Warehouse) అగ్నిమాపక నిబంధనలు (Fire Safety) పాటించకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే.. చుట్టుపక్కల ఉన్న జనసంచారానికి, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన అగ్నిప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అధికారులు, ఇలాంటి అక్రమ కట్టడాలకు వత్తాసు పలకడం విస్మయానికి గురిచేస్తోంది.

​హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారిస్తారా?

​నగరంలో అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ఈ విషయంపై దృష్టి సారించాలని నాగోల్-బండ్లగూడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ మరియు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లు తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి, ఈ అక్రమ షెడ్డును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకముందే యంత్రాంగం మేల్కొంటుందో లేదో వేచి చూడాలి.

About The Author

Related Posts