బిల్డ్ నౌ’.. అవినీతికి ‘బైపాస్’ రోడ్డు!

  • జి.హెచ్.ఎం.సి సర్కిల్ 12 ​ఎల్.బి. నగర్ లో అధికారుల కక్కుర్తి.. నిబంధనలు బూడిదలో పన్నీరు..
  • ​నివాస ప్లాన్లతో కమర్షియల్ దందా.. ‘హైడ్రా’ కన్ను పడాల్సిందే!
  • జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, మున్సిపల్ శాఖ మాత్యులు సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి... 

బిల్డ్ నౌ’.. అవినీతికి ‘బైపాస్’ రోడ్డు!

హైదరాబాద్:

సామాన్యులకు భవన అనుమతులు సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బిల్డ్ నౌ’ (Build NOW) వ్యవస్థ.. అవినీతి అధికారులకు కల్పవృక్షంగా మారింది. పారదర్శకత పేరుతో తీసుకొచ్చిన ఈ ఆన్‌లైన్ విధానంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల వేటలో పడ్డారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఏసీ గదుల్లో కూర్చుని అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఎల్.బి. నగర్ జోన్, హుడా కాలనీలో వెలుస్తున్న ఓ భారీ అక్రమ కట్టడమే దీనికి నిదర్శనం.

​బిల్డ్ నౌ వెబ్‌సైట్ పారదర్శకత మాయ..అవినీతి తారాస్థాయి!

​‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని జిహెచ్ఎంసి సర్కిల్ 12 సరూర్నగర్ సర్కిల్ అధికారులు బిల్డర్లతో కుమ్మక్కై అధికార దుర్వినియోగం చేస్తున్నారు. హుడా కాలనీ ప్లాట్ నం. 39లో (ఫైల్ నంబర్లు: 010392/GHMC/03322/IABP/C5/2025 మరియు 010390/GHMC/03321/IABP/C5/2025) రెండు వేర్వేరు అనుమతులు పొంది, వాటిని అక్రమంగా విలీనం (Clubbing) చేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఆన్‌లైన్‌లో డేటా ఉన్నా, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలను గుర్తించడంలో అధికారులు కావాలనే తాత్సారం చేయడం వెనుక ‘నోట్ల కట్టల’ మత్తు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిహెచ్ఎంసి సర్కిల్ 12 సరూర్నగర్ సంబంధిత అధికారులు టిపిఎస్ అర్చన ఏ.సీ.పి మధు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఎల్బీనగర్ జోన్ స్థాయి అధికారి సి.పి శ్రీనివాస్ యాదవ్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ దృష్టి సారించి సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు.

​ఫైర్ సేఫ్టీకి పాతర..

 మృత్యుకూపాలుగా సెల్లార్లు
​అగ్నిమాపక నిబంధనల ప్రకారం కమర్షియల్ భవనాలకు కఠినమైన రూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నివాస భవనంగా అనుమతి పొంది, రహస్యంగా సెల్లార్ తవ్వేసి, కమర్షియల్ హంగులతో నిర్మాణం సాగిస్తున్నారు. కనీసం సెట్‌బ్యాక్‌లు (Setbacks) వదలకుండా నిర్మిస్తున్న ఈ భవనంలో రేపు ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ కూడా వెళ్లే దారి లేదు. పార్కింగ్ స్థలంలో వ్యాపారాలు చేసేందుకు ప్లాన్ మార్చేయడం బిల్డర్ తెగింపునకు పరాకాష్ట.

​ ‘హైడ్రా’ రాడార్‌లోకి అక్రమ నిర్మాణాలు!

​నగరంలో అక్రమ నిర్మాణాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) దృష్టి ఇప్పుడు ఇలాంటి ఉల్లంఘనలపై పడాల్సిన అవసరం ఉంది. కేవలం చెరువుల ఆక్రమణలే కాకుండా, నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వాణిజ్య సముదాయాలను కూడా హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. హుడా కాలనీలో జరుగుతున్న ఈ అక్రమ విలీనంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చట్టాన్ని అతిక్రమించి నిర్మించిన ప్రతి ఇటుకను హైడ్రా కూల్చివేయక తప్పదని హెచ్చరిస్తున్నారు.

​అవినీతికి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు.. 

లైసెన్సుల రద్దు
​తప్పుడు పత్రాలతో ‘బిల్డ్ నౌ’ ద్వారా అనుమతులు పొందిన బిల్డర్‌పై ఐపీసీ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరికి సహకరించిన ఆర్కిటెక్ట్, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ల లైసెన్సులను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలి. లంచాలకు ఆశపడి విధి నిర్వహణలో విఫలమైన టౌన్ ప్లానింగ్ అధికారులపై ఏసీబీ (ACB) విచారణ జరిపి, అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని బాధితులు కోరుతున్నారు.

​* ప్రభుత్వం మేల్కొనాలి!*

​సాంకేతికతను వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్న ఇలాంటి ‘వైట్ కాలర్’ నేరగాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎల్.బి. నగర్ లో వెలుస్తున్న ఈ అక్రమ కట్టడాన్ని తక్షణమే సీల్ చేసి, స్టాప్-వర్క్ నోటీసులు అమలు చేయాలి. లేనిపక్షంలో ఉన్నతాధికారుల చిత్తశుద్ధిపై సామాన్య ప్రజల్లో అనుమానాలు పెరగడం ఖాయం.

ఈ అక్రమ నిర్మాణంపై హైడ్రా మరియు ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపాలని, నిబంధనలు అతిక్రమించిన భవనాన్ని నేలమట్టం చేయాలని స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు

About The Author