పద్ధతి మార్చుకోకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం..
ఖమ్మం ప్రతినిది :
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హెచ్చరిక..
- ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
- పక్షపాతం, కుంచితబుద్ధి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
- కాంగ్రెస్ లో ఉన్నవారే నిరుపేదలా?
- కాంగ్రెస్ లో లేకపోతే వారు నిరుపేదలు కారా?
- ప్రజలకు ఇచ్చేది నీ సొత్తు కాదు ప్రజల సొమ్ము
- సిపిఎం శ్రేణులలో ఉత్సాహం నింపిన పాదయాత్ర
- లక్ష్మీపురం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర
- తహసిల్దార్ కార్యాలయం వద్ద పాదయాత్ర ముగింపు సభలో
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు

మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ కు ఉపముఖ్యమంత్రివా, తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రివా సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్నవారే పేదవారా, కాంగ్రెస్ లో లేకపోతే వారు పేదవారు కాదా, ఇందిరమ్మ ఇల్లు మంజూరులో పక్షపాతం మానుకోకపోతే మీ ఇంటిని ముట్టడిస్తామని పోతినేని సుదర్శన్ రావు మల్లు భట్టి విక్రమార్కను హెచ్చరించారు. అర్హులైన వారికిందరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇందిరమ్మ గ్రామ కమిటీలను రద్దు చేయాలని, గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర మండల పరిధిలోని లక్ష్మీపురం నుంచి బోనకల్ తహసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ పాదయాత్రను లక్ష్మీపురం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ సిపిఎం జెండా ఊపి ప్రారంభించారు. అమరజీవి కిలారు తిరుపతయ్య స్థూపం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిలారు తిరుపతయ్య స్థూపానికి పోతినేని సుదర్శన్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. సిపిఎం పతాకాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఎగరవేశారు. అనంతరం పోతినేని సుదర్శన్ రావు సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర లక్ష్మీపురం, గోవిందాపురం ఎల్, గార్లపాడు, రావినూతల, బోనకల్, మండల తహసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. తహసిల్దార్ కార్యాలయం ముందు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసిల్దార్ మద్దెల రమాదేవికి పోతినేని సుదర్శన్ రావు, మడిపల్లి గోపాలరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మాదినేని వీరభద్రరావు తదితరులు అందజేశారు. అనంతరం ముగింపు సభ జరిగింది.ఈ సభలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ ఆనాడు మధిర ఎమ్మెల్యేగా ఉన్న బోడెపుడే వెంకటేశ్వరరావు సిపిఎం కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేయలేదని, మధిర నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశారన్నారు. ఆనాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాల లాగా మధిర నియోజకవర్గం అభివృద్ధి చేయాలని బోడెపుడి వెంకటేశ్వరరావు కృషి చేశారన్నారు. కానీ ప్రస్తుత మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేవలం కాంగ్రెస్ కు చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇస్తున్నారని, ఇది ఎక్కడ న్యాయమని ఆయన ప్రశ్నించారు. సిపిఎం పోరాటాలు ఎలా ఉంటాయో గతంలో అధికారంలో ఉన్న పాలకులకు తెలుసునని, మరల అదే పరిస్థితి తమకు కల్పించి ఇబ్బందులు ఎదుర్కోవద్దని బట్టి విక్రమార్కకు హితవు పలికారు. ప్రభుత్వం అంటే ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించాలే గాని కేవలం కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే సిపిఎం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజలకు ఇస్తుంది ప్రజల సొమ్మేనని, మీ సొమ్ము కాదని అది తెలుసుకొని పక్షపాతంగా కాకుండా ప్రజాస్వామ్యతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము రాజకీయాలకి అతీతంగా పనిచేస్తామని, పక్షపాతం వహించమని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేడు పక్షపాతంగా మల్లు భట్టే విక్రమార్క వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ పద్ధతి మానుకోవాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు ఇంత కుంచితబుద్ధి ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇల్లు ఇస్తామని బెదిరింపులకు దిగటం బాధాకరమన్నారు. మల్లు భట్టి విక్రమార్క తన పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించకపోతే వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. పాదయాత్రకు వచ్చిన వందలాదిమంది నిరుపేదలు తాము డబ్బులు ఇస్తే రాలేదని కడుపు మంటతో పాదయాత్రకు వచ్చారన్నారు. మీలాగా సభలకు, సమావేశాలకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు డబ్బులు ఇచ్చి ప్రజల్ని తెచ్చుకొనే అలవాటు సిపిఎం కి లేదన్నారు. గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన ఎర్రబోయిన నాగేశ్వరరావుని కాంగ్రెస్ గూండాలు అతి కిరాతకంగా హత్య చేశారని, ఆమెకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే భట్టి విక్రమార్క ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుందన్నారు. అదేవిధంగా గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన వికలాంగుడు కన్నెపోగు బాబు ఇల్లు కూలిపోతే ఇల్లు ఇవ్వలేదంటే మల్లు భట్టి విక్రమార్క బుద్ధి ఎంత నీచంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది పోరాటానికి ప్రారంభం మాత్రమేనని మల్లు భట్టి విక్రమార్క తన పక్షపాతాన్ని విడనాడకపోతే అర్హులైన ఇందిరమ్మ పేదలందరితో భట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యతంగా వ్యవహరిస్తారో పక్షపాతంగా వ్యవహరిస్తారో మల్లు భట్టి విక్రమార్క తేల్చుకోవాలని సూచించారు.
