సాహితీ విశ్వంభరుడు
(సినారె గారికి అక్షరాంజలి)
మట్టిలో మాణిక్యంలా హాలికులింట పుట్టి
కవితా నాగలితో సాహితీ సేద్యం చేపట్టి
జాతికి జవాన్ని జీవాన్ని ఇచ్చే
కృతులెన్నో పండించి
నిరంతరం అక్షర యఙ్ఞంతో
సాహిత్య కళామతల్లి సేవలో
తపించిన తరించిన ధన్యశీలి!
ఆ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం
తెలుగు కవితా వనితా పద లాస్యం!
పలికిన మాట తెలుగు వరాల మూట!
జనుల నాలికలపై నిలిచిన తేనె ఊట!
నాగార్జున సాగరం తెచ్చి
సాహితీ పిపాసను తీర్చిన
సాహితీ భగీరథుడు
కర్పూర వసంత రాయలతో
కావ్య కర్పూరాన్ని కౌశలంగా వెలిగించి
సాహితీ సుమసౌరభాలను
వెదజల్లిన సరసుడు!
తెలుగు గజళ్ళ నెమళ్ళతో
సాహిత్య నందనవనంలో
నాట్యమాడించిన అభినవ దర్శకుడు!
ప్రపంచ పదుల తో జీవన
సమస్యలకు పదిలమైన పరిష్కారాలను
అందించిన ప్రవీణుడు!
విశ్వంభరత్వం తో మహత్వ కవిత్వంతో
తెలుగు సాహిత్యానికి అగ్రతాంబూలమిచ్చిన
ఆధునిక సాహితీ విశ్వంభరుడు!
ఎందరో శిష్యులకు స్ఫూర్తిని
ఇచ్చిన ఆదర్శ గురుమూర్తి!
ఎందరో పరిశోధకులకు దిశా నిర్దేశం చేసి వారి దశను మార్చిన సాహితీ మార్గదర్శి!
ఎందరో కవులకు నిత్య స్ఫూర్తి! విశ్వసాహిత్యాన వెలిగే తెలుగు కీర్తి!
తెలుగుదనం పండిన దివ్య మూర్తి
సాహితీ మీనారే! మన సినారే!
సాహిత్య కళా విభూషణ
కవితా కళా ప్రపూర్ణ
స్వర్ణ నంది పురస్కార గ్రహీత
కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు
