ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నాం
తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం

ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నాం అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు. సూర్యాపేటలోని తిరుమల గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువజన సమితి నాయకులు నారబోయిన కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తెలంగాణ బీసీ రిజర్వేషన్లు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన మాట్లాడారు.సదస్సు లో ప్రారంభంలో మహాత్మా జ్యోతిబపులే,బి ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వర్గాల నుండి తెలంగాణ ఆధిపత్యం వర్గాలకు అధికార బదలాయింపు కొరకు కాదని ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించడం కొరకు సాధించుకున్నామని ఆ దిశగా అడుగులు వేయడమే తెలంగాణ ప్రజల యొక్క కర్తవ్యం అని అన్నారు.బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. అందరూ ఐక్యంగా పోరాడి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించాలన్నారు.ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు సమానత్వం, ఆత్మగౌరవం అన్నారు.రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్సులను గవర్నర్లు ఆమోదంతెలపకపోవడందురదృష్టకరమన్నారు.
రిజర్వేషన్లు 50% దాటొద్దు అనేది సుప్రీం కోర్టు తీర్పు కాదని,1931 బీసీ సెన్సస్, 1961 సెన్సస్, 1979 మండల కమిషన్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని అప్పటి పరిస్థితుల్లో కోర్టు ఆ అభిప్రాయం వ్యక్తం చేసిందని చెప్పారు. రిజర్వేషన్లు సవరించుకోవచ్చని మండల కమిషన్ రిపోర్టులోనే ఉందన్నారు. రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించాలి అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టం చేసి పంపితే దాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదని,గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు.సామాజిక అసమానతలను నిర్మూలించడంలో రిజర్వేషన్లు కీలక సాధనమని,తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పడినదే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అని పేర్కొన్నారు.
తీర్మానాలు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి.రాబోయే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలి.బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ రీతిలో ఐక్య ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర పాలకులతో చర్చించాలి..
About The Author
12 Mar 2026
