మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నాయకులు
సిద్దిపేట:
రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన నివేదిక ప్రకారం మాదిగల జనాభా శాతం 10 నుంచి 11 శాతం మధ్య ఉన్న నేపథ్యంలో, అదే మేరకు ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ మాట్లాడుతూ, కుల గణన నివేదికలో మాదిగల జనాభా 10.3%గా నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం 10 నుంచి 11 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయసమ్మతమని పేర్కొన్నారు.
మాదిగల జనాభా శాతానికి తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వాలని గత కొన్నేళ్లుగా ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నిజమైందని అన్నారు. గతంలో 9% రిజర్వేషన్లను సమర్థించిన వారు మాదిగ జాతికి అన్యాయం చేశారని తీవ్రంగా విమర్శించారు.
అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో మాదిగలకు 11% వాటా కేటాయించాలని, అలాగే సంక్షేమ పథకాల ద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన నివేదిక ప్రకారం మాదిగలు భూమిలేని పేదలు, దినసరి కూలీల్లో కూడా అధికంగా ఉన్నారని, ఇది వారి వెనుకబాటుతనాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
అలాగే శాసన మండలి, లోక్‌సభ, రాజ్యసభలలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమని విమర్శించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశత జయంతి ఉత్సవాల కమిటీలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను సభ్యుడిగా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.మాదిగలు మరింత సంఘటితంగా ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
