ఎల్బీనగర్, ఆగష్టు 14 (భారత శక్తి): “మధ్యవర్తిత్వం ఫర్ ద నేషన్” కార్యక్రమం సందర్భంగా, రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్ జడ్జి అన్ని వర్గాల ప్రజలు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రచారాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,“మధ్యవర్తిత్వం అనేది కోర్టు కేసులను వేగంగా, తక్కువ ఖర్చుతో, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే ఉత్తమ మార్గం. దీర్ఘకాలం సాగిపోయే వివాదాలను నివారించి, రెండు పక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం కలిగించే విధంగా మధ్యవర్తిత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా కుటుంబ, ఆస్తి, వ్యాపార మరియు ఇతర పౌర వివాదాల్లో ఇది శాశ్వత పరిష్కారానికి దారితీస్తుంది” అని వివరించారు. అలాగే, “కేసు స్వభావం మధ్యవర్తిత్వానికి అనుకూలమైతే, కోర్టు మార్గదర్శకత్వంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సంప్రదించి సమస్యలను స్నేహపూర్వకంగా ముగించుకోవాలి. దీని వల్ల కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల భారం తగ్గి, న్యాయవ్యవస్థ వేగవంతమవుతుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీ వాణి మాట్లాడుతూ, “మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకూ గోప్యతా హామీ ఉంటుంది. ఇరువురి హక్కులు, భావాలు కాపాడబడే విధంగా చర్చలు సాగుతాయి. ఇది బలవంతం కాదని, పూర్తిగా స్వచ్ఛంద పద్ధతిలోనే వివాద పరిష్కారం జరుగుతుందని ప్రజలు గ్రహించాలి” అని అన్నారు. ఆమె ఇంకా, “మధ్యవర్తిత్వం వల్ల కోర్టు తీర్పుతో వచ్చే ‘గెలుపు-ఓటమి’ భావన తగ్గి, పరస్పర అంగీకారంతో ‘ఇద్దరికీ లాభం’ అనే స్థితి ఏర్పడుతుంది. ఈ విధానం సమాజంలో స్నేహం,ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది” అని పేర్కొన్నారు.ఈ కాంపెయిన్ లో వైవాహిక వివాదాలు, గృహహింస కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, వాణిజ్య వివాదాలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, వినియోగదారుల వివాదాలు, రుణ వసూలు కేసులు, పౌర కేసులు, భూసేకరణ కేసులు ఇతర తగిన కేసులు మధ్యవర్తిత్వానికి అనుకూలమైనవిగా పరిగణించి పరిష్కరించబడతాయి. కార్యక్రమం ముగింపులో,జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీ వాణి ఇద్దరూ ప్రజలకు పిలుపునిస్తూ, “రంగారెడ్డి జిల్లా మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సంప్రదించి, మీకు తగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని, సమయం, ఖర్చు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి” అని సూచించారు.