ఫీజు రీఎంబర్స్ మెంట్ లేక విద్యార్థుల అరిగోస..
:
సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలలు.. పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు అటెండ్ కాలేక.. చెల్లించడానికి ఆర్ధిక స్థోమత లేక అల్లాడుతున్న స్టూడెంట్స్.. ఫీజ్ రీ యంబర్స్ మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం.. దాదాపు రూ. 7,500 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.. చెల్లించాల్సిన బకాయిల్లో సగానికిపైగా ఇంజినీరింగ్ కళాశాలలకే.. వెంటనే ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న " కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ..".. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక..
ఫీజ్ రీ యంబర్స్ మెంట్ పుణ్యమా అని సామాన్య విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివే అవకాశం కల్గింది.. కొంత కాలం ఈ ప్రక్రియ బాగానే కొనసాగింది.. కానీ రాను రాను ప్రభుత్వాలు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకుండా నిలిపివేసింది.. దీంతో ఆర్ధికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఇరకాటంలో పడ్డారు.. కోర్సు పూర్తయినా కూడా కళాశాలల యాజమాన్యం ఫీజు బకాయిలు ఉండటంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.. దీంతో విద్యార్థులు పైచదువులకు వెళ్లలేక, ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాలేక నా నా యాతన పడుతున్నారు.. అదేమని అడిగితే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు.. మీకు అంత అత్యవసరంగా సర్టిఫికెట్స్ కావాలంటే డబ్బులు కట్టి తీసుకువెళ్ళండి అని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.. కొంత ఆర్ధికంగా వెసులుబాటు ఉన్న వారు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు.. ఇక కొంతమంది అప్పో సొప్పో చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు.. కానీ ఇటు ఆర్ధిక పరిస్థితి బాగా లేక, అప్పులు పుట్టే అవకాశం లేక ఎంతో మంది పేద విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. ఇదే విషయమై కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. ఫీజు బకాయిలు ప్రభుత్వం నుండి అందకపోవడంతో.. తాము ఆర్ధికంగా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని.. కనీసం మా దగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.. తప్పని సరి పరిస్థితుల్లో విద్యార్థులను డిమాండ్ చేయాల్సి వస్తోందని వారు అంటున్నారు..
దాదాపు మూడేళ్ల బకాయిలు పేరుకుపోవడంతో బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం కళాశాలలకు కష్టంగా మారింది. హైదరాబాద్ శివారులోని ఓ కళాశాల ఏప్రిల్ నెల వేతనం సగమే ఇచ్చింది. ప్రభుత్వం నుంచి బోధనా రుసుములు వచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామని చెప్పింది. నగరంలో నాలుగు దశాబ్దాల క్రితం నెలకొల్పిన మరో కళాశాలకు రూ.60 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. యాజమాన్య కోటా సీట్లను సైతం మెరిట్ ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు కేటాయించే ఆ కళాశాల ఇప్పుడు నెలనెలా జీతాలు చెల్లించేందుకు ఇబ్బందిపడుతోంది. ఇక చిన్న కళాశాలలు అయితే నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు.
ఘట్‌కేసర్‌లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల తమకు రూ.92 కోట్ల బోధనా రుసుంల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, తాము నెలకు రూ.5 కోట్లు వేతనాలకు ఇవ్వాలని, ఈ పరిస్థితుల్లో తాము విద్యాసంస్థను నడిపే పరిస్థితి లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఇప్పటికే రూ.41.27 కోట్లకు ఆర్థిక శాఖ టోకెన్లు జారీ చేసినందున ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర తీర్పునిచ్చింది. వాటిని వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చని, మొదటి వాయిదా రూ.10 కోట్లు రెండు వారాల్లో చెల్లించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మొదటి వాయిదా చెల్లించింది. దీంతో మరికొన్ని కళాశాలలు అదేబాటలో నడిచేందుకు సమాలోచనలు చేస్తున్నాయి.
ఈ విధంగా మిగతా కళాశాలలు కూడా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాయి’ అని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ చెప్పారు. తమకు కూడా బకాయిలు విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలల సంఘం తరఫున ఇటీవల పిటిషన్ దాఖలు చేశామని, విచారణకు రావాల్సి ఉందని తెలిపారు.. ‘ఇప్పటికే మూడేళ్ల బకాయిలున్నాయి. కనీసం కొత్త విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచైనా రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలి. వారి నుంచి ఫీజు మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు మాకు అనుమతివ్వాలి’ అని కళాశాలల యాజమాన్యం ఇటీవల ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది..
ఈ క్రమంలో ఇటు విద్యార్థుల తరఫున.. అటు కళాశాలల యాజమాన్యం తరఫున కూడా న్యాయ పోరాటం చేయాలని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ", " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " భావిస్తోందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేశారు..