
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో పంద్రాగస్టు వేడుకలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని, వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య బృందాన్ని,108 అంబులెన్స్ ను వేడుక వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకూ తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వివిధ శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఉండాలన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.