విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
నులి పురుగుల నివారణ మాత్రలు అందరికీ పంపిణీ: కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ ప్రతినిధి :
సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ.. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యార్థులు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నులి పురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 01-19 వయస్సు కలిగిన బాలబాలికలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడిలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలనీ, విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే, మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్బెండజోల్ మాత్ర వేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా వైద్య, విద్యా శాఖతో పాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగుల వల్ల పిల్లల ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతియేటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో రెండు పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కాగా, విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాలు తినే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యాలు దరిచేరుతాయని, దీంతో చదువుపై ఆసక్తి ఉండదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.. విద్యార్థులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని, భోజనం చేసే ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పండ్లు కూరగాయలు కోసేముందు నీటితో శుభ్రంగా కడగాలని విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.