ఆరోగ్య మిత్రలకు వెయిటేజీ మార్కులు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.
- ఆరోగ్యశ్రీ ఉద్యోగుల శ్రమను గుర్తించాలి.
- ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి..
హైదరాబాద్:
ఇటీవల ఏఎన్‌ఎం (సహాయక నర్సు మిడ్‌వైఫ్) పరీక్షలు రాసిన ఆరోగ్య మిత్రలందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ యాజమాన్యం తక్షణమే స్పందించి, వెయిటేజీ మార్కులకు సంబంధించిన అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని (ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్) జారీ చేయాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య విజ్ఞప్తి చేశారు. గత 19 ఏళ్లుగా ప్రభుత్వ పరిధిలో పేద ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షలు రాసిన ప్రతి ఒక్క ఆరోగ్య మిత్రకు వెయిటేజీ మార్కులతో పాటు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని అందించి ఆదుకోవాలని ఆయన ట్రస్ట్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
*డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా నిరాకరణేనా?
అనుభవానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన విభాగాల జాబితాలో ఆరోగ్యశ్రీ విభాగం ఉన్నప్పటికీ, అర్హులైన ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని గిరి యాదయ్య ఆక్షేపించారు. నిబంధనల ప్రకారం లభించాల్సిన హక్కును నిరాకరించడం వల్ల ఎంతోమంది ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
