
మణుగూరు :
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 8,9,10 న జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) ప్రజా భవన్ లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో 17 సంవత్సరాల బాలబాలికల ఉమ్మడి 10 జిల్లాల నుండి పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన వారిని జాతీయస్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఏజెన్సీ గిరిజన జిల్లా భద్రాద్రి లోని పినపాక మండలం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులు, కేంద్ర పాలిత క్రీడాకారులు సుమారు 650 పాల్గొంటారని తెలిపారు. మణుగూరు పట్టణ, పినపాక ప్రముఖుల సహాయ సహకారాలతో క్రీడలను వీక్షించేందుకు వచ్చే అతిథులు, క్రీడాకారులకు ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. మండల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. చరిత్రలో నిలిచి పోయే విధంగా అంగరంగ వైభవంగా జరిపించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగు తున్నాయన్నారు. ఇలాంటి పోటీలు మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో జరగడం వలన గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ఆసక్తి పెరిగి వారు కూడా క్రీడా రంగంలో రాణించడాని కి అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం క్రీడా పోటీలకు ఆహ్వానం పలికే పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీడీఓ సంకేత్, ఎంపిఓ వెంకటేశ్వర్లు,ఈడి వీరన్న, ఎమ్ ఈ ఓ కొమరం నాగయ్య, పినపాక మాజీ ఎంపిపి కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులు శివసైదులు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.