మున్సిపల్ చెత్త సేకరణ ప్రైవేటీకరణకు సీఐటీయూ తీవ్ర వ్యతిరేకం
- ప్రైవేట్ ఆటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
- జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి డిమాండ్
వికారాబాద్:
తాండూర్ పట్టణంలో మున్సిపల్ చెత్త సేకరణను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేట్ ఆటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం తాండూర్ పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ను తాండూర్ మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరేష్, కార్యదర్శిగా డి. వెంకట్ నియమితులయ్యారు.
సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ చెత్త సేకరణ కోసం ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులను పక్కనబెట్టి ప్రైవేట్ వ్యవస్థను ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు.
జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెల ఒకటో తేదీన కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ రికార్డుల్లో కార్మికుల పేర్లలో ఉన్న సమస్యలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రెగ్యులర్ జవాన్లను నియమించి కార్మికులపై ఉన్న పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని నాయకులు తెలిపారు. అయినప్పటికీ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడం, వచ్చిన జీతాలు కూడా క్రమం తప్పకుండా అందకపోవడం వల్ల కార్మికుల జీవనం దెబ్బతింటోందన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. బలరాం, నర్సిములు, అయిబ్ ప్రకాష్, ఆశప్ప, డి. లక్ష్మణ్, జి. నర్సిములు, బి. వీరేశం, కె. శంకర్, జయశివకుమార్, ఎన్. వెంకటప్ప, ఎం. పవన్, మహేష్, ఎం. చిన్న, డి. శ్రీనివాస్, ఎన్. రాములు, డి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
