ప్రజా విశ్వాసమే అధికారుల అసలైన గుర్తింపు
- ఆక్రమణల తొలగింపుపై ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిశానిర్దేశం
- *ఉద్యోగం హోదా కాదు... బాధ్యత!
- * క్షేత్రస్థాయి పరిశీలనతోనే సమస్యల పరిష్కారం
హైదరాబాద్:
ప్రజాసేవలో నిబద్ధత, పరిపాలనలో పారదర్శకత ప్రదర్శిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపినప్పుడే అధికారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీఐ)లో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
:క్షేత్రస్థాయిలోనే వాస్తవాలు తెలుస్తాయి..
సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినప్పుడే వాస్తవ పరిస్థితులు అవగతమవుతాయని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా వారి సమస్యలను సులభంగా అర్థం చేసుకోవచ్చని, వాటికి సత్వర పరిష్కారాలు చూపడం ద్వారా ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొనవచ్చని వివరించారు. ప్రతి నిర్ణయంలోనూ నిష్పక్షపాత వైఖరిని అవలంబిస్తూ, ప్రజా ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం ఒక హోదాగా కాకుండా, అప్పగించిన బాధ్యతగా భావించి సేవాదృక్పథంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా “భూముల పరిరక్షణ - ఆక్రమణల తొలగింపు” అనే అంశంపై ప్రొబేషనరీ అధికారులకు కమిషనర్ సమగ్ర అవగాహన కల్పించారు. ప్రభుత్వ భూముల సంరక్షణలో రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతటి కీలకమైనదో గుర్తుచేశారు. భూ ఆక్రమణల నివారణకు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిళ్లను ఎలా అధిగమించాలో వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీ) విస్తృతంగా వాడుకుంటూ భూ రికార్డుల నిర్వహణను, వివరాల నమోదును పక్కాగా చేపట్టాలని సూచించారు.
:మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర (బ్రాండ్) ఉండాలి!
"అధికారిక విధుల నిర్వహణలో మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి. సమాజంలో మీకంటూ ఒక మంచి ముద్రను (బ్రాండ్) సృష్టించుకోవాలి" అని రంగనాథ్ ఆకాంక్షించారు. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతతో వ్యవహరిస్తూ, తమ విధులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నామనే తృప్తి అధికారుల్లో ఉంటే ఎలాంటి మానసిక ఒత్తిడికైనా దూరం కావచ్చునని ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముఖ్యంగా 'హైడ్రా' సంస్థ పనితీరు, ఆపరేషన్ల విధానాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు తొలగించేటప్పుడు ఎదురయ్యే రాజకీయ, సామాజిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని చెరువుల పునరుద్ధరణతో పాటు, రాబోయే వర్షాకాలంలో వరదల కట్టడికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా ముందస్తుగా తీసుకుంటున్న చర్యల వ్యూహాలను కమిషనర్ అడిగి తెలుసుకుని అభినందించారు.

