లీటరుకు రూపాయి బాదుడు.. ఐదు రోజుల్లో రెండోసారి!

  • ముడి చమురు నెపంతో జనం జేబులకు చిల్లు.. నిత్యావసరాలు ప్రియం కాక తప్పదా?
  •  *రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి ఆగ్రహం

లీటరుకు రూపాయి బాదుడు.. ఐదు రోజుల్లో రెండోసారి!

హైదరాబాద్:

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను నెపముగా చూపుతూ, చమురు సంస్థలు సామాన్య ప్రజలపై మరోసారి ధరల భారాన్ని మోపాయి. ఒక పక్క పెరిగిన ధరలతో జనం అల్లాడుతుంటే.. ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వేటుతో సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గాయం మానకముందే మరో వాత!
"గత శుక్రవారం (మే 15) లీటరుకు ఏకంగా రూ. 3 పెంచిన చమురు సంస్థలు, ఆ గాయం మానకముందే నేడు మరోసారి లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచడం దారుణం. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ₹111.88కి చేరింది. ఇక జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల ఈ ధరలు మరింత భారంగా మారాయి," అని పాండురంగా రెడ్డి పేర్కొన్నారు. తగ్గినప్పుడు తగ్గించని కంపెనీలు, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు మాత్రం క్షణాల్లో ఆ భారాన్ని వినియోగదారులపై నెట్టేయడం శోచనీయమని విమర్శించారు.

*మధ్యతరగతిపై 'రవాణా' భారం.. నిత్యావసరాలు ఆకాశానికి!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదని, దీని ప్రభావం రవాణా రంగంపై పడి, చివరికి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద ప్రజల కుటుంబ బడ్జెట్‌ను ఈ తాజా పెంపు పూర్తిగా అతలాకుతలం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు మూగప్రేక్షకుడిలా వ్యవహరించకుండా తక్షణమే స్పందించాలి. చమురు సంస్థలు తమ లాభాల కోసం ప్రజల నడ్డి విరుస్తున్నాయని, ఇప్పటికైనా ధరల పెంపును నిలిపివేయాలని పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్రం:పెట్రో ఉత్పత్తులపై అదనపు పన్ను (ఎక్సైజ్ సుంకం) తగ్గించాలి.

*రాష్ట్రం:విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించి సామాన్యులకు తక్షణ ఉపశమనం కల్పించాలి.

About The Author

Related Posts