బదిలీ చేసినా కుర్చీ వదలని డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!
లంచాలు, అక్రమాలపై సీఎంఓ వరకూ ఫిర్యాదులు
- * ఉట్నూర్ ఆర్డీఓగా పంపినా 'హెచ్ఎండీఏ' దాటని వైనం
- * నిబంధనల ధిక్కరణపై సీరియస్ అయిన సిసిఎల్ఏ
- *అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ దాటవద్దని హుకుం
హైదరాబాద్:
రాష్ట్ర రెవెన్యూ శాఖలో కలకలం రేపిన డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిల అవినీతి, మొండికేంపు వ్యవహారానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. హెచ్ఎండీఏలో తిష్టవేసి, బదిలీ ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసిన ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీ అండ్ ఏ) నియమావళి, 1991లోని రూల్ 8 ప్రకారం షర్మిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్ఏ) లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజిలెన్స్ నుంచి సీఎంఓ దాకా కంప్లైంట్లు!
చాలా కాలంగా డెప్యుటేషన్ (అన్యసేవలు) పై హెచ్ఎండీఏలో కీలక బాధ్యతల్లో ఉన్న షర్మిల.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె బాధితుల నుంచి విజిలెన్స్ విభాగానికే కాకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ప్రాథమిక చర్యగా ఆమెను లూప్ లైన్ లోకి నెట్టేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కొంతకాలం క్రితం ఆమెను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ)గా, జిల్లా ఎన్నికల నమోదు అధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
పోస్టింగ్ ఇచ్చిన చోటుకు వెళ్లకుండా మొండికేసి
ఉట్నూర్ బదిలీ అయినా డిప్యూటీ కలెక్టర్ షర్మిల మాత్రం హెచ్ఎండీఏ కుర్చీని వదిలేందుకు నిరాకరించారు. కొత్తగా కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు పలుమార్లు మౌఖికంగా ఆదేశించినా లైట్ తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను, ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కనబెట్టి తీవ్ర ధిక్కరణకు పాల్పడ్డారు.
డిప్యూటీ కలెక్టర్ షర్మిల బదిలీ అయిన స్థానంలో జాయిన్ కాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక నిరంతర సవరణ (SIR) మ్యాపింగ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడిందని సిసిఎల్ఏ తన ఉత్తర్వుల్లో తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ అత్యవసర విధులను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిదని పేర్కొన్నారు.
హెడ్‌క్వార్టర్స్ దాటొద్దు:
సిసిఎల్ఏ హుకుం
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని సిసిఎల్ఏ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సస్పెన్షన్ కాలంలో సిసిఎల్ఏ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని (హెడ్‌క్వార్టర్స్) విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని గట్టిగా ఆదేశించింది. ఉన్నతాధికారులను సైతం లెక్కచేయకుండా హెచ్ఎండీఏలో తిష్టవేసిన అధికారిణిపై సస్పెన్షన్ వేటు పడటం రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
