
భూపాలపల్లి :
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో శిక్షణా సివిల్ సర్వీసెస్ అధికారులు, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ, డిఆర్డీఓ, ప్రణాళిక శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారులు గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమని, అందుకోసం ఫీల్డ్ లెవల్ ఫంక్షనరీలతో సమన్వయం, గ్రామాలలోని ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ జరగాలని సూచించారు. సేవలు, సంక్షేమ పథకాల అమలు, సమస్యల గుర్తింపు, తక్షణ పరిష్కారంపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. పలిమెల, మహా ముత్తారం మండలాల్లో అధికారులతో కలిసి ప్రాంతాలను సందర్శించి మహిళా సంఘాలు, రైతులు, యువతతో ఇంటరాక్షన్ కావాలని సూచించారు. పలిమెల, మహా ముత్తారం మండలాలను నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాకులుగా ప్రకటించిందని, ఐదు సెక్టారులుకు సంబంధించి 49 ఇండికేటర్లు, 81 పారామీటర్లు నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో 76 శాతం అడవులు విస్తరించి ఉన్నాయని వివరించారు. 12 మంది అధికారులు రెండు బృందాలుగా పలిమెల, మహా ముత్తారం మండలంలో పర్యటన చేయనున్నారని, ఇట్టి పర్యటనకు సంబంధించి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అవసరాలను తెలుసుకుని ఆచరణలోకి తీసుకువెళ్లే విధంగా యంత్రాంగానికి సూచనలు చేయాలని సూచించారు. అధికారుల పర్యటనకు స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారి డా మధుసూదన్,
డీఈఓ రాజేందర్, వ్యవసాయ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాల కృష్ణ, సీపీఓ బాబూరావు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి
తదితరులు పాల్గొన్నారు.