పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ..
ఖమ్మం ప్రతినిది :
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమైన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, ఎంపిటిసి, జెడ్పిటిసి) ఎన్నికలను పారదర్శకంగా నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలను పారదర్శకంగా, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించనున్నామని, ప్రతి విడతలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపారు.
