జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాధిక ఎంపిక
పోరుమామిళ్ల :
కడపజిల్లా, కాశినాయనమండలం రెడ్డి కొట్టాల ఎస్.టి కాలనీ ప్రాథమిక పాఠశాల నందు ఎస్జీటీగా పనిచేస్తున్న ఎన్. రాధిక జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరు గతంలో చిట్వేలు , కలసపాడు, కాశినాయన మండలాలలో పనిచేశారు. 2005 వ సంవత్సరం లో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయినిగా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి పాఠశాలలోను తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
పాఠశాలల విలీనం లాంటి క్లిష్ట సమయంలో నరసాపురం ప్రాథమిక పాఠశాల పౌండేషనల్ పాఠశాలగా మారి కేవలం 1,2 తరగతులతో మూసివేతకు చేరువలో వున్నపుడు విద్యార్థుల సంఖ్యను 5 నుండి 23 కు పెంచి, పాఠశాల ఉనికిని కాపాడడంలో ఎనలేని కృషి చేశారు. అంకిత భావంతో, వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ ఉపకరణాల సమర్థ వినియోగంతో విద్యార్థుల్లో మంచి ప్రమాణాలను సాధించి తల్లిదండ్రుల విశ్వాసాన్ని, ప్రభుత్వ బడి పట్ల వున్న నమ్మకాన్ని రెట్టింపు చేశారు. తదుపరి సంవత్సరం కూడా అదే ఒరవడిని కొనసాగించి నమోదును కాపాడుకుంటూ పాఠశాల తిరిగి మోడల్ ప్రైమరీ పాఠశాలగా మారడానికి శాయశక్తులా కృషిచేశారు.
ప్రస్తుతం పనిచేస్తున్న రెడ్డికొట్టాల ఎస్.టి కాలనీ ప్రాథకమిక పాఠశాలలో కూడా అడవి బిడ్డలైన యానాది పిల్లలను బడివైపు మరల్చడానికి, పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి ఎంతగానో కషిచేస్తున్నారు. పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించడం, సమరూప దుస్తులు కుట్టించడం లాంటి కార్యక్రమాలను చేస్తూ తల్లిదండ్రులకు నిరంతరం అందుబాటులో వుంటూ అడవిబిడ్డలను ప్రేమతో అక్కున చేర్చుకొని, వారిలో అక్షర జ్ఞానం పెంపొందించడానికి నిస్వార్ధంగా, అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి నిజాయితీగా కష్టపడే, వృత్తే దైవంగా నమ్మి అంకితభావంతో పనిచేసే గురువుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం... నిజమైన గురుపూజోత్సవ కానుకగా పలువురు అభివర్ణిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ కడపలో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నెమళ్ళదిన్నె రాధిక అందుకోబోతున్నారు..
About The Author
13 Sep 2025