కొంపలు ముంచుతున్న కో లివింగ్ షేర్ హాస్టల్స్..
ఈ హాస్టళ్ల నిర్వాహణకు అనుమతులు ఎవరు ఇస్తున్నారు..?
- ప్రభుత్వ నియంత్రణ కరువవడంతో పెను ముప్పు..
- హైదరాబాద్ లో అడుగడుగునా షేర్ హాస్టల్స్..
- బాధ్యత, నియంత్రణ లేకుండా నడుస్తున్న హాస్టళ్లు..
- ఈ హాస్టళ్ల నిర్వాహణకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు..?
- జీ.హెచ్.ఎం.సి. అధికారులు ఏమి చేస్తున్నారు..?
- పోలీస్ వ్యవస్థ అనేది అసలు పని చేస్తోందా..?
- ప్రభుత్వం దృష్టికి ఈ కల్చర్ వ్యవహారం రాలేదా..?
- పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం కాదా..?
- ఓయో హోటల్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు..
- మరి వాటికంటే ప్రమాదకరంగా ఈ హాస్టల్స్ సాగుతున్నాయి..
- నియంత్రణ లోపించడంతో విచ్చలవిడితనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి..
- ఈ కల్చర్ ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

స్వేచ్చను కోరుకోవడం తప్పుకాదు.. కానీ స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చుకోవడం ఎంతో ప్రమాదం.. ఒకప్పుడు ఒక ఆడ, మొగ మాట్లాడుకోవాలంటేనే భయపడేవాళ్లు.. కానీ కాలం మారింది.. ఆడ, మొగ తేడాలు, తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి సాగుతున్నారు.. ఇది సంతోషించదగిన విషయమే.. కానీ హద్దులు మీరిన ప్రవర్తనే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.. రోజు రోజుకూ పెరుగుతున్న విదేశీ సాంప్రదాయాలు, ఇంటర్నెట్ ప్రభావం యువత ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చేస్తోంది.. ఎదో చేయాలని, ఎదో అనుభవించాలనే కాంక్ష రోజు రోజుకూ పెరిగిపోతోంది.. ఒకప్పుడు ప్రేమికులు ఒంటరిగా కలవాలంటే గగనంగా ఉండేది.. ఆతరువాత ఓయో పుణ్యమా అంటూ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా గడపసాగారు.. తాము కోరుకున్న లోకంలో విహరించసాగారు.. కానీ ఓయోల వ్యవహారం విమర్శలకు దారి తీయడంతో దానిపై కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.. ఇప్పటికి బాగానే ఉంది అనుకునేలోపే ఎవరు ప్రవేశపెట్టారో..? ఎవరు అనుమతులు ఇచ్చారో తెలియదు కానీ హైదరాబాద్ మహానగరంలో ఆడ, మొగ కలిసి ఉండేలా షేర్ హాస్టల్స్ సాంప్రదాయం వచ్చింది.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా గల్లీ గల్లీకి ఇలాంటి హాస్టళ్లు వెలిశాయి.. భారీగా ఫీజులు వసూలు చేస్తూ ముక్కు ముఖం తెలియని జంటలకు ఒకే రూంలో వసతి ఇస్తున్నారు.. అక్కడ ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు.. అసలు ఇంత దైర్యంగా ఇలాంటి హాస్టళ్లు ఎలా నడుస్తున్నాయి..? ఎవరు వీరికి పర్మిషన్లు ఇస్తున్నారు..? ప్రభుత్వం గానీ, జీ.హెచ్.ఎం.సి. అధికారులు గానీ, పోలీసులు గానీ ఏమి చేస్తున్నారు..? ఇలాంటి హాస్టళ్లు నడపవచ్చని ప్రభుత్వం ఏదైనా చట్టం తెచ్చిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి.. దీనిపై సమగ్ర విచారణతో కూడిన సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
(స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్) హైదరాబాద్ కాకుండా ఇతర పట్టణాల్లో సైతం అడుగడుగునా షేర్ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. “విద్యార్థులకు సౌకర్యం”, “ఉద్యోగులకు చవకైన వసతి” అనే పేర్లతో ఇవి విస్తరిస్తున్నప్పటికీ, వాస్తవానికి చాలా చోట్ల చట్టం, నియంత్రణ, బాధ్యత అనే పదాలకు ఏమాత్రం విలువ లేకుండా నడుస్తున్నాయి.
కొన్ని షేర్ హాస్టల్స్ నిజంగా యువతకు తాత్కాలిక వసతిగా ఉపయోగపడుతున్నాయి. అయితే, ఎక్కువ భాగం హాస్టల్స్‌లో అనుమతులు లేవు, భద్రతా ప్రమాణాలు లేవు, సమాజ పట్ల బాధ్యత లేదు. ఫలితంగా ఇవి అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలు, అనైతిక సంబంధాలు, రాత్రి వేళల్లో గందరగోళం.. ఇవే ఇప్పుడు ఈ హాస్టల్స్ లో వెలుగుచూస్తున్న వాస్తవాలు..
ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం...
నియమాలు, నిబంధనలు ఉన్నాయి.. హాస్టల్స్ నిర్వాహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సీసీ కెమెరాలు తప్పనిసరి. నివాసితుల వివరాలు పోలీసులకు అందించాలి. ఇవన్నీ కాగితాల మీద మాత్రమే కనిపిస్తున్నాయి.. భూకంపం వచ్చినట్టే సంఘటనలు జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటారు. అప్పటికీ రెండు హాస్టల్స్ మూసి, వార్తల్లో హంగామా చేసి, మళ్లీ కళ్లుమూసుకుంటారు. ఇలాంటి కంటితుడుపు చర్యలు అసలు సమస్యను పరిష్కరించడానికి పనికిరావు అంటున్నారు విశ్లేషకులు..
అవును నిజానికి ఇక్కడ నష్టపోతున్నది సమాజమే. నిర్లక్ష్యంతో నడిచే ఈ హాస్టల్స్ వల్ల కాలనీలు అసౌకర్యానికి గురవుతున్నాయి. యువత తప్పుదారి పట్టే ప్రమాదం పెరుగుతోంది. “తాత్కాలిక వసతి” అనే ముసుగులో ఇవి అనైతిక స్థావరాలుగా మారిపోతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. ఇది ఒక సామాజిక సమస్య.
కఠిన చర్యలు తప్పనిసరి...
ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది.. లైసెన్స్ లేని హాస్టల్స్‌ను తక్షణమే మూసివేయాలి. చట్టాన్ని ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన శిక్షలు విధించాలి. సమాజానికి హాని కలిగించే హాస్టల్స్‌ను అనుమతి రద్దు చేసి శాశ్వతంగా నిలువరించాలి. లేకపోతే రేపు జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తులకే కాకుండా సమాజానికే శాపమవుతాయి. ఆడ మొగ కలిసి ఉండేలా నిర్వహిస్తున్న హాస్టల్స్ ఒక వసతి సదుపాయం కావాలి. కానీ ఇవి అసాంఘిక వేదికలుగా మారిపోతున్నాయి.. భద్రతకు పెను ప్రమాదం సృష్టిస్తున్న ఇలాంటి వాటిపట్ల ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉండకూడదు. ఇప్పటికైనా కఠిన నియంత్రణ, కఠిన చర్యలు లేకపోతే, రేపటి సమాజం ఈ నిర్లక్షానికి మూల్యాన్ని చెల్లించక తప్పదు.
పెరుగుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటున్న షేర్ హాస్టల్స్, కో-లివింగ్ స్పేసెస్.. లైసెన్సుడ్ వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి.. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ సెక్టార్‌లో పనిచేసే యువత ఎక్కువగా వీటిలో ఉంటున్నారు. విపరీతమైన సంపాదన, కోరికలు వీరిని ఈ హాస్టళ్లవైపు నడిపిస్తున్నాయి.. ఇక్కడైతే ఏ గొడవా ఉండదు అని భావిస్తున్నారు.. పోలీసుల రైడింగ్ ఉండదు.. పెద్దవాళ్ళ భయం ఉండదు.. కోరిన సౌకర్యాలు, కోరిన తిండి దొరుకుతుంది.. అందుకే ఎక్కువుగా ఇటువైపు ఒగ్గుచూపుతున్నారు.. కోరినంత డబ్బులు ఇస్తుండటంతో హాస్టళ్ల యాజమాన్యం కూడా వారికి సహకరిస్తున్నారు..
ఇలాంటి షేరింగ్ హాస్టళ్ల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు మేధావులు.. అద్దె తక్కువగా అవుతుంది.. వేరువేరుగా ఉండటానికి కంటే షేర్ చేసుకుంటే గదుల అద్దె, కరెంటు, ఇంటర్నెట్, మెస్ ఖర్చులు తక్కువ అవుతాయి.. ఇక కాలేజీలు, ఆఫీసులకు దగ్గరగా ఉండేలా ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక రాకపోకల సమస్య కూడా తక్కువ అవుతుంది.. కాగా ఆడ, మొగ కలిసి ఉండటం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కలిసికట్టుగా ఉండే అలవాటు వస్తుంది. అధునాతన సౌకర్యాలు అందుతాయి.. ఉదాహరణకు వాషింగ్ మెషిన్, వైఫై, సీసీ కెమెరాలు, హౌస్‌కీపింగ్ లాంటి సదుపాయాలు కిక్కడ లభిస్తాయి..
నష్టాలు మాత్రం అధికంగా ఉంటాయి...
అనైతిక సంబంధాలు ఏర్పడతాయి.. కొంతమంది ఈ హాస్టల్స్‌ను సద్వినియోగం చేసుకోకుండా, వ్యభిచారానికి, మాదక ద్రవ్యాల వినియోగానికి వేదికగా మార్చేస్తున్నారు. అలాగే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతులు లేకుండా నడపడం వల్ల అమ్మాయిలకు, అబ్బాయిలకూ ప్రమాదాలు రావచ్చు. ఇలాంటి హాస్టళ్లు కాలనీల్లో పెరగడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు, రాత్రివేళ శబ్దం, అసాంఘిక కార్యకలాపాల అనుమానం మొదలవుతాయి.
అయితే చాలా హాస్టల్స్ మున్సిపల్/పోలీస్ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరూ తీసుకోరు. మున్సిపల్ కార్పొరేషన్లు, జీ.హెచ్.ఎం.సి., హెచ్.ఎం.డీ.ఏ. పరిధిలో హాస్టల్స్ లేదా పీజీలు తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ఎవరూ ఈ నిబంధనలను పాటించడం లేదు.. లంచాలకు మరిగిన అధికారులు ఈ హాస్టళ్లను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.. నెల నెలా తమ జీతం కంటే ఎక్కువుగా అదనపు సంపాదన వస్తుండటంతో పట్టించుకోవడం లేదు.. అయితే పోలీసులు తరచుగా తనిఖీలు చేసి అక్రమంగా నడుస్తున్న హాస్టల్స్‌ను మూసేస్తున్నారు. ఇది కూడా తాత్కాలికంగా మాత్రమే జరుగుతోంది.. తమకు టంచనుగా మామూళ్లు ఇవ్వని హాస్టళ్లపై మాత్రమే తనిఖీలు చేసి చర్యలు చేపడుతున్నారు.. ఇది వాంఛనీయం కాదు..
ఇక హాస్టల్ యజమానులు నివాసితుల పూర్తి వివరాలు అంటే ఆధార్, ఫోన్ నంబర్, ఉద్యోగం/కాలేజ్ వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి. కానీ మామూళ్లు చెల్లించి చాలామంది హాస్టల్స్ యాజమాన్యం ఈ ప్రక్రియ చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. ఇక భద్రత కోసం సీసీ కెమెరాలుఅమర్చాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎవరూ పాటించడం లేదన్నది వాస్తవం.. విద్యార్థులు, ఉద్యోగులకు మాదక ద్రవ్యాలు, అనైతిక సంబంధాల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వ సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఎంతవరకు ఫలితాన్నిస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే.. అయితే సరైన నియమావళి, భద్రతా చర్యలతో నడిచే షేర్ హాస్టల్స్ ఉపయోగకరమే. కానీ అనధికారంగా నడిచే వాటి వల్ల సమాజంలో అనేక సమస్యలు వస్తున్నాయి. వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
