సైబర్ వేటగాళ్ల గుట్టురట్టు!
- మల్కాజ్‌గిరి పోలీసుల మెరుపు దాడి: ఐదు ముఠాల ఆటకట్టు, ఆరుగురు నిందితుల అరెస్ట్.
- దేశవ్యాప్తంగా విస్తరించిన మాయగాళ్ల నెట్‌వర్క్.. బాధితులకు రూ. 6.80 లక్షల నగదు రికవరీ.
మల్కాజ్‌గిరి:
నిరుద్యోగుల ఆశలను, మదుపరుల అత్యాశలను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై మల్కాజ్‌గిరి కమీషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతవారంలో (మే 10 నుండి మే 16 వరకు) జరిపిన మెరుపు దాడుల్లో ఐదు కీలకమైన సైబర్ మోసాల గుట్టురట్టు చేశారు. ఈ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ మాయగాళ్ల బారిన పడి మోసపోయిన బాధితులకు న్యాయస్థానం ద్వారా రూ. 6.80 లక్షల నగదును తిరిగి ఇప్పించినట్లు పోలీసులు వెల్లడించారు.
కమిషన్ల కక్కుర్తి.. ఖాతాల విక్రయం!
పోలీసులు ఛేదించిన కేసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులంతా సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తూ (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), కమీషన్లు దండుకుంటున్న స్థానిక ఏజెంట్లుగా తేలింది. వీరు అమాయకుల సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లించడానికి ప్రధాన వంతెనలా వ్యవహరిస్తున్నారు.
1.జర్మనీలో ఉద్యోగాలంటూ భారీ మోసం
సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన కాసాని సతీష్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 'నెక్స్ట్ పాత్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్' సంస్థ ప్రతినిధిగా, 'దిల్‌కుష్' అనే నకిలీ గుర్తింపుతో నిరుద్యోగులకు జర్మనీలో వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. ఎనిమిది మంది అభ్యర్థుల నుంచి పాస్‌పోర్టులు, ధృవీకరణ పత్రాలు సేకరించి నకిలీ నియామక పత్రాలు (ఆఫర్ లెటర్లు) సృష్టించారు. భద్రతా డిపాజిట్ పేరిట బాధితుడి నుండి రూ. 5,39,999/- వసూలు చేసి ఆ తర్వాత ఫోన్లు బంద్ చేశారు. ఈ కేసులో నిందితుడు సతీష్ సైబర్ నేరగాళ్లకు తన ఖాతాను అందించినట్లు తేలింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన ఇందారపు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాల వేదిక (ఆన్‌లైన్ పోర్టల్)లో ఇల్లు అద్దెకు ఉందంటూ ప్రకటన ఇచ్చిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. తాను ఆర్మీ 'కెప్టెన్ పవార్' అని పరిచయం చేసుకుని, సైనిక నిబంధనల ప్రకారం ముందస్తు చెల్లింపులు చేయాలంటూ నమ్మించారు. ఖాతా ధృవీకరణ ప్రక్రియలో భాగంగా నగదు తిరిగి వస్తుందంటూ నమ్మించి బాధితురాలి నుంచి ఐదు విడతల్లో రూ. 2,75,545/- కాజేశారు. నవీన్ ఈ కేసులో ఖాతాల సేకరణదారుడిగా వ్యవహరించాడు.
3.వాట్సాప్ సమూహం.. రూ. 21.50 లక్షలు గోవిందా!
హైదరాబాద్‌కు చెందిన కొమ్ము విష్ణు (కొత్తపేట), మక్కల అరవింద్ (కుత్బుల్లాపూర్)లను పోలీసులు జైలుకు పంపారు. బాధితుడి ప్రమేయం లేకుండానే ఒక నకిలీ వాట్సాప్ సమూహం (VIP గ్రూప్)లో యాడ్ చేశారు. తాము స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించి, నకిలీ వాణిజ్య వేదిక (ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్) ద్వారా ప్రాథమిక వాటా అమ్మకాల (IPO) పేరిట రూ. 21.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. తీరా లాభాలు వచ్చాక విత్‌డ్రా చేసుకోబోతే.. దళారీ రుసుము (బ్రోకరేజ్ ఛార్జీల) పేరిట మరో రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
4.కస్టమ్స్ అధికారులమంటూ బెదిరింపులు
వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పందుల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ సుంకముల శాఖ (కస్టమ్స్) అధికారి నేహా శర్మ మాట్లాడుతున్నానంటూ బాధితుడికి ఫోన్ చేసి, బ్రిటన్ నుండి మీ పేరు మీద బంగారు గొలుసులు, విదేశీ కరెన్సీ ఉన్న పార్సిల్ వచ్చిందని బెదిరించారు. ఆపై రిజర్వ్ బ్యాంక్ (RBI) పేరిట నకిలీ ఈమెయిళ్లు పంపి.. కరెన్సీ మార్పిడి, సుంకము, ఆదాయపు పన్ను పేరిట రూ. 4,79,000/- గుంజారు.
5.ఎండీ ఫోన్ హ్యాక్.. ఒకేసారి రూ. 40 లక్షలు స్వాహా!
విజయపురి కాలనీ (వనస్థలిపురం)కి చెందిన నన్నాక రఘునాథ్‌ను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్‌కు సైబర్ కేటుగాళ్లు ఎవరికీ తెలియకుండా ఒక ప్రమాదకరమైన లింక్ ద్వారా హ్యాకింగ్ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. అనంతరం ఆయన వాట్సాప్ అకౌంట్ ద్వారా అకౌంటెంట్‌కు మెసేజ్‌లు పంపి, అత్యవసరంగా నగదు బదిలీ చేయాలంటూ ఆదేశించారు. స్వయంగా డైరెక్టరే పంపించారనుకుని బాధితుడు రెండు రోజుల్లో ఏకంగా రూ. 40,08,000/- బదిలీ చేసి మోసపోయాడు.
జాగ్రత్త: నెటిజన్లూ.. ఇవి అస్సలు నమ్మకండి!
నేరుగా ఇంటర్వ్యూలు లేకుండా వచ్చే పార్ట్-టైమ్ ఉద్యోగ ప్రకటనలను నమ్మొద్దు.
అసాధారణ లాభాలు, గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే కొత్త వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టకండి.
వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిళ్లలో వచ్చే గుర్తుతెలియని లింకులను అస్సలు క్లిక్ చేయవద్దు.
ఆన్‌లైన్ వ్యక్తులు పంపే లింకుల ద్వారా ఎలాంటి ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు.
డిజిటల్ అరెస్ట్ లేదా పార్సిల్ బెదిరింపులకు అస్సలు భయపడకండి.
*ముఖ్య గమనిక: పొరపాటున సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930', హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా **www.cybercrimes.gov.in, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సూచించారు

