కొడంగల్‌లో రైతు కన్నీరు… సీఎం సొంత నియోజకవర్గంలోనే ధాన్యం దుస్థితి చూడండి
- ప్రభుత్వం పై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు
- వరి కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు.
సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల, దౌల్తాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, శుభ ప్రద్ పటేల్ తో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మహిళా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…
“45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదు. వర్షాలకు తడిసి ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు..jpeg)
“సీఎం సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే… మిగతా జిల్లా లో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి” అని పేర్కొన్నారు. రైతులు తమతో మాట్లాడుతూనే తడిసిన ధాన్యాన్ని చూపిస్తూ బాధ వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం
కొడంగల్ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేశారు. రైతులకు అవసరమైన యూరియా సరైన సమయంలో అందడం లేదని, గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. పంట దిగుబడులు భారీగా వచ్చినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
“రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే వేచి చూస్తున్నారని. పంట అమ్ముకోలేక కొందరు రైతులు కల్లాల వద్దే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి కనిపిస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న కొనుగోలు వ్యవస్థపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో ఎంత మేర సాగు జరిగింది, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే స్పష్టమైన లెక్కలు కూడా ప్రభుత్వానికి లేవని ఆరోపించారు. దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
“మేము వెళ్లి మాట్లాడితేనే కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయనీ, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజూ ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు. రైతులకు అండగా బీఆర్ఎస్ నిలబడితేనే ప్రభుత్వం స్పందిస్తోందని అన్నారు.
కొడంగల్ రైతులు సీఎం క్యాంప్ కార్యాలయం ముందు నిరసనకు వెళ్లాలని పిలుపునిచ్చిన సబితా ఇంద్రారెడ్డి… వెంటనే యూరియా అందుబాటులో ఉంచి, వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..jpeg)
