మే 24 న బీసీ ప్రభంజనం విజయవంతం చేయాలి...
ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ పిలుపు
ఎల్బీనగర్:
మే 24 న ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభను విజయవంతం చేయాలని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మన్సురాబాద్ డివిజన్ ఎస్ కే గార్డెన్ లో మంగళవారం బీసీ ప్రభంజనం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ, బీసీ ప్రభంజనం సభ రాజకీయాలకు అతీతంగా జరుగుతుందనీ,ఏ వర్గానికి వ్యతిరేకంగా ప్రభంజనం సభ జరగడం లేదని బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే బీసీ ప్రభంజనం సభ జరుగుతుందన్నారు. చాప కింద నీరులా బీసీ వాదం బలపడుతుందని, భావజాల వ్యాప్తి కోసం ప్రభంజనం సభ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నో సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఎల్బీనగర్ ప్రాంతంలో బీసీ ప్రభంజనం సభ జరగడం సామాజిక ఉద్యమాలకు ఊపిరి పోస్తుందని ఆయన పేర్కొన్నారు. మే 24 న ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో జరిగే బీసీ ప్రభంజనం సభ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు అన్నారు. గత కొన్ని నెలలు కిందట నిర్వహించిన బీసీ జన భోజనాలకు వేలాది మంది బీసీలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారని వివరించారు.ఎల్బీనగర్ లో జరగబోయే బీసీ ప్రభంజనం సభ ఖచ్చితంగా బీసీ ఉద్యమానికి దశ దిశను నిర్దేశిస్తుందని సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి కె.వి. గౌడ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీసీలకు పది డివిజన్లు కేటాయించాలని బీసీ సంఘం నాయకులు కందికంటి శ్రీధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ కన్వీనర్ తెలంగాణ వెంకన్న అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కేటాయించే వరకు బీసీలు రాజీ లేని ఉద్యమం కొనసాగించాలని తెలంగాణ రక్షణ సేనా నాయకులు రాంకోఠి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు కందింకంటి శ్రీధర్ గౌడ్, చింతల విజయ్, ఉపేందర్ యాదవ్, బాలస్వామి, ప్రశాంత్, రమేష్, దూడల అమర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ ముదిరాజ్, శ్రీధర్ దర్జీ, హరి శంకర్ గౌడ్, తానాజీ, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
